22-11-2025 12:45:57 AM
సంగారెడ్డి, నవంబర్ 21(విజయక్రాంతి): పల్లెల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలవుతుంది. ఆశావాహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూ స్తున్న పంచాయతీ సమరానికి ముహుర్తం ఖరారైనట్లే కనిపిస్తోంది. డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. ఓటర్ల జాబి తా సవరణ ప్రక్రియ చేపట్టిన ఎన్నికల కమిషన్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ హించింది. దీంతో త్వరలో పంచాయతీ నగారా మోగే అవకాశం ఉండటంతో పల్లె రాజకీయం వేడెక్కింది.
పాత రిజర్వేషన్ల ప్రకారమేనా ?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న రాష్ట్ర ప్రభు త్వం గత సెప్టెంబర్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేసింది. అయితే ఇందుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో విచారించిన కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఆదేశాలను సమర్థించింది. దీంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది.
ఈ నెల 24న మరోసారి హైకోర్టులో విచారణ జరగనుండగా ప్రభుత్వం రిజర్వేషన్ల అమలుపై స్పష్టమైన నివేదిక ఇవ్వనుంది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామన్న ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే వీటిని రొటేషన్ చేస్తారా?.. కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారా? అనేది హైకోర్టు తీర్పు తర్వాత స్పష్టత రానుంది.
మొదలైన ఎన్నికల సందడి..
డిసెంబర్ ఒకటి నుంచి 9వరకు ప్రజాపాలన వారో త్సవాలు నిర్వహించాలని ప్రభు త్వం సంకల్పించింది. ఈ కార్యక్రమం ముగిశాక ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవ కాశముంది. గురువారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధా న అధికారి పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బంది, సామగ్రిని సమకూర్చుకోవాలని ఆదేశించారు. అర్హులైన యువతకు ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా చేపడుతున్నారు.
కొత్తగా దరఖాస్తులు స్వీకరించడంతో పాటు జాబితాలో మార్పులు, చేర్పులు చేప ట్టి ఈ నెల 23న ఓటర్ల తుది జాబితా వెల్లడించనున్నారు. ఎన్నికల కమిషన్ కసరత్తు చేస్తుండటం.. మార్చిలోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రమిచ్చే 15వ ఆ ర్థిక సంఘం నిధులు రద్దయ్యే అవకాశమున్నట్లు మంత్రివర్గం ప్రకటించడం.. గమనిస్తే ఈసారి పంచాయతీ నగారా మోగే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది.
పట్టు నిలుపుకునేందుకు పార్టీల కసరత్తు..
పంచాయతీ సమరంపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికలు పార్టీ గుర్తుల ప్రకారం నిర్వహించనప్పటికీ పల్లెల్లో తమ పట్టు నిలుపుకునేందుకు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తున్నాయి. మద్దతుదా రులను గె లిపించుకుంటే పార్టీపరంగా నిర్వహించే ఎన్నికలకు కలిసి వస్తుందని ఆశిస్తు న్నాయి. ఆ దిశగా ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల వివరాలు ఆరాతీస్తున్నాయి. పోటీకి సై.. అంటున్న ఆశావహులూ పార్టీ, ప్రజల మ ద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పల్లెల్లో రాజకీయంవేడెక్కింది.