17-07-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జులై 16(విజయ క్రాంతి) మద్యం మత్తులో అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మృతికి కారణమైన నిందితునికి 10సంవత్సరాల జైలు శిక్ష,రు. 11వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి నారాయణ బుధవారం తీర్పు వెలువరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా రాంపూర్ గ్రామానికి చెందిన కూనారం సునీల్ 2022 జూన్ 13 న అతని స్నేహితులు పల్లికొండ రోహిత్, ప్రవీణ్ తో కలిసి బైక్ పై ధర్మపురి మండలం దోనూరు గ్రామానికి వచ్చి పని ముగించుకుని వెళ్లే క్రమంలో పల్లికొండ రోహిత్ అతిగా మద్యం సేవించి తన స్నేహితులు వద్దన్నా వినకుండా వారిని బైక్ పై ఎక్కించుకొనిఅజాగ్రత్తగా బైక్ నడపి దోనూరు గ్రామ శివారులో కింద పడిపోయాడని తెలిపారు.
దీంతో బైక్ మధ్యలో కూర్చున్న సునీల్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడన్నారు.మృతుని తండ్రి పోచన్న ఫిర్యాదు మేరకు అప్పటి ధర్మపురి ఎస్.ఐ కిరణ్ కుమార్ నిందితుడి పై కేసు నమోదు చేసి, విచారణ జరిపి ఛార్జ్ షీటు దాఖలు చేసినట్లు తెలిపారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మల్లేశం తమ వాదనలు వినిపించగా సాక్షులను విచా రించిన న్యాయమూర్తి ఎస్. నారాయణ నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష రు.11 వేల జరిమాన విధించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ నిం దితునికి శిక్షపడేలా సహకరించిన పిపి మల్లేశం, విచారణ అధికారి కిరణ్, సిఎంఎస్ ఎస్త్స్ర శ్రీ కాంత్ కోర్టు కానిస్టేబుల్ శ్రీధర్ లను అభినందించారు. మద్యం సేవించి వాహనాన్ని నడపడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని, మద్యం సేవించి అజాగ్రత్తగా వాహనం నడిపే వారిపై కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.