17-07-2025 09:40:48 PM
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేతుల మీదుగా స్వీకరణ
మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్ఓ)గా విధులు నిర్వహిస్తున్న శ్రీరాముల శ్రీకాంత్ సమర్పించిన పరిశోధన అధ్యయనానికి తెలంగాణ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. 'సాంఘిక, రాజకీయ ఉద్యమాల్లో సామాజిక మాధ్యమాల పాత్ర, తెలంగాణ ఉద్యమంపై కేసు స్టడీ' అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక అధ్యయనానికి నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన రెండవ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ ఛాన్స్ లర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి డాక్టరేట్ సర్టిఫికెట్ ను శ్రీరాముల శ్రీకాంత్ స్వీకరించారు.
ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమంలో యువత అగ్రభాగంలో నిలిచారని, దీనికి ఉద్యమ ఆకాంక్షను విస్తృతంగా జనబహుళ్యంలోకి తీసుకెళ్లడంలో సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా దోహదపడిందని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ విధంగా సోషల్ మీడియా కీలక భూమిక పోషించిందని వివరిస్తూ శ్రీకాంత్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు.
శ్రీకాంత్ ని అభినందించిన సీఎండీ...
ఇప్పటి వరకు సింగరేణి ఉద్యోగుల్లో పీ హెచ్ డీ సాధించిన వారు కొద్ది మంది మాత్రమే ఉన్నారని, ఓ పక్క ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత చదువుల పట్ల జిజ్ఞాసతో శ్రీకాంత్ పీ హెచ్ డీ సాధించడం అభినందనీయమని సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ పేర్కొన్నారు. వృత్తి బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత విద్యార్హతలు సాధించాలనుకునే వారికి ప్రేరణను ఇచ్చారని, తన పరిశోధన అనుభవంతో సింగరేణి ప్రజా సంబంధాల విభాగానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.