01-08-2025 12:22:38 AM
కుమ్రంభీం జిల్లా కోర్టు సంచలన తీర్పు
కుమ్రంభీం ఆసిఫాబాద్, జులై 31 (విజయక్రాంతి): ఓ యువతిని ప్రేమించి పెండ్లి చేసుకుంటానని శారీరకంగా అనుభవించిన వ్యక్తికి పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ.35 వేల జరిమానా విధిస్తూ గురువారం జిల్లా కుమ్రంభీం జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంవీ రమేశ్ తీర్పునిచ్చారు.
ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కాగజ్ నగర్ మండలం ఇస్గాం గ్రామంలో నివాసముండే ఆర్మీ ఉద్యోగి మెహనంద్ సర్కార్ తనకు పరిచయమున్న 23 ఏండ్ల యువతి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడు. యువతి కుటుంబ సభ్యులతోనూ చనువుగా ఉండేవాడు. 2019, జూన్ 30 సెలవుపై ఇంటికి వచ్చాడు. అదే ఏడాది జూలై 4న యువతిని ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని చెప్పి బలవంతంగా శారీరకంగా వాడుకున్నాడు.
అనంతరం పెండ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పీపీ జగన్మోహన్‌రావు పలువురు సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష విధించారు. కేసులో నిందితుడికి శిక్షపడేలా కృషిచేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.