06-11-2025 06:44:09 PM
హనుమకొండ కలెక్టరేట్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన మేనేజ్ మెంట్లు
హనుమకొండ (విజయక్రాంతి): విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ డిగ్రీ అండ్ పీజీ కాలేజీల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. సుందర్ రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలల యాజమాన్యాలు, కళాశాలలు ఆందోళన నిర్వహించాయి. కళాశాలలకు తాళం వేసి నిరవధిక బంద్ తో వివిధ రూపాల్లో నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. తరగతులతో పాటు కళాశాలలు మూసివేసి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా యాజమాన్యాలు రోడ్డెక్కాయి. హనుమకొండ కలెక్టరేట్ ముందు ప్రభుత్వ తీరును నిరసిస్తూ కళాశాలల యాజమాన్యాలు నిరసనను వ్యక్తం చేశాయి.
ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేసి కళాశాలలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాలల అధ్యాపకులకు, సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న యాజామాన్యాల దుస్థితి పై ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కళాశాలల మేనేజ్ మెంట్లు డిగ్రీ అండ్ పీజీ కాలేజీల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్. సుందర్ రాజ్ యాదవ్ హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డు పై బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పస్తులుంటున్న కళాశాలల యాజామాన్యాలు, సిబ్బందిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరిష్ ను కలిసి డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్ సుందర్ రాజ్ యాదవ్ నేతృత్వంలో కళాశాలల యాజమాన్యాలు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ,పీజీ కాలేజీల అసోసియేషన్ ట్రెజరర్ వేణుమాధవ్, సంజీవ్ రెడ్డి, నారాయణ రెడ్డి, కృష్ణమోహన్, హరేందర్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.