18-10-2025 03:28:54 PM
50 శాతం రిజర్వేషన్ల నిబంధన బీసీ ప్రజలకు మాత్రమేనా?
బంద్ సంపూర్ణంతో దేశానికి సంకేతం పంపినట్లయింది: మందకృష్ణ
హైదరాబాద్: తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై బంద్(Telangana BC bandh) కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల అంశం బలహీనవర్గాల డిమాండ్ అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ(Manda Krishna Madiga) అన్నారు. మహాత్మా గాంధీ బస్ స్టేషన్(Mahatma Gandhi Bus Station) వద్ద బీసీ బంద్ లో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ.... బీసీ రిజర్వేషన్లు తెలంగాణ పౌర సమాజం అంగీకరిస్తున్న అంశమన్నారు. బీసీ బంద్ సంపూర్ణంతో దేశానికి సంకేతం పంపినట్లయిందని వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో భాగంగా 10 శాతం అమలు చేస్తున్నారని మందకృష్ణ తెలిపారు. అగ్రకులాల పేదల జనాభాకు మించి రిజర్వేషన్లు అమలు జరుగుతోందని ఆరోపించారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు(EWS Reservations) తెచ్చినప్పుడే 50 శాతం రిజర్వేషన్లు దాటిపోయాయని మందకృష్ణ వివరించారు. 50 శాతం రిజర్వేషన్ల నిబంధన బీసీ ప్రజలకు మాత్రమేనా?, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం దాటినప్పుడు రాని అడ్డం ఇప్పుడెందుకు?, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో రాని అడ్డంకులు బీసీ రిజర్వేషన్లకు(BC Reservations) ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి ఒకతీరుగా రిజర్వేషన్ల అంశం ఉండవద్దని ఆయన అభిప్రాయపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అన్ని పార్టీలు అంగీకరించాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడులో అడ్డుకోనప్పుడు తెలంగాణలో అడ్డుకోవడం న్యాయమా? అని మందకృష్ణ కేంద్రాన్ని ప్రశ్నించారు.