17-07-2025 08:34:52 PM
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాల్లో మనమే గెలవాలి
ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్
ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): రాజ్యాధికారంలో వాటాయే లక్ష్యంగా ప్రతి ముదిరాజ్ బిడ్డ పోరాడాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు డాక్టర్ బట్టు విట్టల్ పిలుపునిచ్చారు. గురువారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని బాలగౌడ్ ఫంక్షన్ హాల్ లో జరిగిన మండల ముదిరాజ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జనాభాలో అత్యధిక శాతం ముదిరాజులు ఉన్నప్పటికీ వారికి రాజకీయ పరంగా, విద్యా, ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. వారి జనాభాకు సరిపడా అవకాశాలు రాక అణిచివేతకు గురవుతున్నారు.
ఎన్నో ప్రభుత్వాలు మారిన ముదిరాజుల తలరాతలు మారడం లేదని, ముదిరాజుల కేవలం ఆయా రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారారని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలకు ముదిరాజులు ఓటు బ్యాంకుగా మారకూడదని, నాయకత్వ లక్షణాలను పెంచుకొని ఐక్యమత్యంతో కలిసి మెలిసి ఉండి ప్రజాప్రతినిధులుగా ఎదగాలన్నారు. ఇకనైనా ముదిరాజులు చైతన్యవంతమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలుపొంది సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పిటిసిలుగా ముదిరాజు లు గెలుపొందేందుకు కులస్తులందరూ సహకరించాలని ఆయన అన్నారు.
కులస్తుల మధ్య ఏవైనా మనస్పర్ధలు, గొడవలు ఉంటే సామరస్యంగా కూర్చుని పరిష్కరించుకోవాలని, అంతే తప్ప కక్షలు పెంచుకొని కొరికి ఒకరు సహకరించుకోకుండా ఇతరులకు రాజకీయ అవకాశాలు కల్పించకూడదన్నారు. త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి సంఘాలు లేని గ్రామాల్లో నూతన సంఘాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటానన్నారు. ఇతర కులస్తులకు కాకుండా ముదిరాజులకు మాత్రమే ఓటు వేసుకుంటే ఎందరో ప్రజా ప్రతినిధులు పెరుగుతారని, తద్వారా ముదిరాజుల నాయకత్వం మెరుగుపడుతుంద న్నారు. ఏవైనా మనస్పర్ధలు ఉంటే కూర్చొని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు.
అంతిమంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్ కులస్తులు ఎక్కువ సంఖ్యలో గెలిచేలా చూడాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా అధ్యక్షులు బట్టు విట్టల్ ముదిరాజ్ నూతన మండల, యువజన కమిటీల కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముదిరాజ్ సంఘం ఎల్లారెడ్డి మండల గౌరవాధ్యక్షులుగా కుడుముల సత్యనారాయణ, అధ్యక్షులుగా ప్యాలాల రాములు, కార్యనిర్వాహక అధ్యక్షులు దుద్దుల సాయిరాం, ఉపాధ్యక్షులు నీల సిద్ధిరాములు, జక్కుల అశోక్, బాలయ్య, ఒట్లం భాస్కర్, బోనగిరి ఎల్లయ్యలు, ప్రధాన కార్యదర్శి గోనె శ్రీకాంత్, కార్యదర్శలుగా కాశీరామ్, లక్ష్మయ్య, చంద్రబాబు, దత్తు, రవీందర్, కాశిరాం, కోశాధికారి మరి సూర్య ప్రకాష్, కార్యవర్గ సభ్యులుగా కేబీ రాజు, పాండు, గంగాధర్, సాయిబాబా, వెంగల్ రాములు లను ఎన్నుకున్నారు.