calender_icon.png 7 September, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాతో పంటలకు అనేక లాభాలు

04-09-2025 04:44:53 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): నానో యూరియాను వరి పంటలో వాడటం వలన అనేక లాభాలు ఉన్నాయని ఏఈఓ సతీష్(AEO Satish) రైతులకు అవగాహన కల్పించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామంలో గురువారం నానో యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏఈఓ సతీష్ మాట్లాడుతూ.. నానో యూరియా ద్రవ రూపంలో ఉండే ఎరువని, దీనిని చాలా తక్కువ మోతాదులో వాడినా మొక్కలకు అవసరమైన పోషకాలు అందుతాయని అన్నారు. యూరియా గుళికలతో పోలిస్తే నానో యూరియా తో  అనేక లాభాలున్నాయని, నానో యూరియాను ఆకులపై పిచికారీ చేయడం వల్ల, మొక్కలు పోషకాలను మరింత సమర్థవంతంగా గ్రహిస్తాయని అన్నారు.

దీనివల్ల పంట దిగుబడి దాదాపు 8% వరకు పెరుగుతుందని, సాంప్రదాయ యూరియాలో దాదాపు 30-50 శాతం నత్రజని నేలలోంచి ఆవిరైపోతుందని, నానో యూరియాలో ఈ నష్టం చాలా తక్కువగా ఉంటుందని అన్నారు. నేరుగా మొక్క ఆకుల ద్వారా యూరియా తీసుకోబడుతుందని, తక్కువ మొత్తంలో యూరియా వాడటం వల్ల భూగర్భ జలాల్లోకి నత్రజని చేరడం తగ్గుతుందని, తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చని అన్నారు. నానో యూరియా తక్కువ పరిమాణంలో అవసరం కాబట్టి, రవాణా, నిల్వ ఖర్చులు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోల్సాని రామ రావు తో పాటు  రైతులు పాల్గొన్నారు.