10-05-2025 12:50:30 AM
వివరాలు వెల్లడించిన ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం మే 9 (విజయక్రాంతి) జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ఆదివాసి ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు, ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై సిపిఐ ఎంఎల్ మావోయిస్టు సభ్యులు తెలంగాణ పోలీసుల ఎదుట పెద్ద సంఖ్యలో లొంగిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 38 మంది నక్సలైట్లు స్వచ్ఛందంగా లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లొంగిపోయిన మావోయిస్టుల వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టు సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న పునరవాస సౌకర్యాలకు ఆకర్షితులై వివిధ క్యాడర్లలో ఉన్న వారంతా తమ ఆయుధాలను విడిచి జనజీవన శ్రవంతిలోకి వస్తున్నారని ఆయన తెలిపారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు నిషేధిత మావోయిస్టు పార్టీలో పని చేసిన వివిధ కేడర్లకు చెందిన 265 మంది మావోయిస్టులు జిల్లా పోలీసులు ఎదుట లొంగిపోయారని తెలిపారు. డివిజన్ కమిటీ సభ్యులు ఒకరు, 11 మంది ఏరియా కమిటీ సభ్యులు, 29 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు, 92 మంది మీలీషియా సభ్యులు, 33 మంది ఆర్టీసీ కమిటీ సభ్యులు, 47 మంది డిఏ కేఎంఎస్, 30 మంది సీ ఎన్ ఎం సభ్యులు, 22 మంది జి ఆర్ డి ఎస్ సభ్యులు లొంగిపోయినట్టు తెలిపారు.
నా రోజురోజుకు మావోయిస్టు పార్టీపై ఆదివాసి ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని, కాలం చెల్లిన సిద్ధాంతాలతో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని భావించి మావోయిస్టులు జనజీవన స్రవంతి వైపు ప్రయాణిస్తున్నారని ఎస్పీ తెలిపారు . మావోయిస్టులు ఎవరైనా జనజీవన శ్రవంతిలోకి రావాలనుకుంటే కుటుంబ సభ్యులను, స్థానిక పోలీసులను ఆశ్రయించవచ్చని ఆయన తెలిపారు.