స్నేహితుడి ముసుగులో భారీ మోసం
- సీనియర్ సిటిజెన్‌ను నమ్మించి రూ.5లక్షలు
- అపహరించిన యువకుడు అరెస్టు
శేరిలింగంపల్లి, జూన్ 15 (విజయక్రాంతి): పరిచయం పేరుతో సన్నిహితంగా మెలిగి, 66 ఏళ్ల సీనియర్ సిటిజన్ బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షలు మాయం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చెందిన వి. భారతి యూనియన్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉంచుకున్నారు. ఆమె ఇంటర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ వాడేవారు కాదు. అయితే మే 9,11 తేదీల్లో ఆమె ఖాతా నుంచి రూ.5 లక్షలు డెబిట్ అయ్యాయని ఎస్‌ఎంఎస్ వచ్చింది.
ఒక్క ఓటీపీ లేదా ఫోన్ కాల్ కూడా రాకుండానే డబ్బు అదృశ్యమైంది.బ్యాంకు వద్ద పరిష్కారం దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విజయవాడకు చెందిన నరేందర్ అనే వ్యక్తి ఈ మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు. బాధితురాలి కుటుంబంతో సన్నిహితంగా ఉన్న నరేందర్ ఇంటికి తరచుగా వచ్చి పోయేవాడు.ఆ నమ్మకాన్ని వాడుకుని ఆమె మొబైల్ ఫోన్లో బ్యాంకింగ్ యాప్లు ఇన్స్టాల్ చేసి,ఖాతాలోకి ప్రవేశించి డబ్బును ఆన్లైన్ గేమింగ్ యాప్లకు బదిలీ చేశాడు.
ఆన్లైన్ గేమింగ్కు బానిసైన నరేందర్ మోసం చేసిన సొమ్మును గేమ్స్ ఆడటానికి వాడినట్లు తెలిసింది. సాంకేతిక ఆధారాలు, మొబైల్ లొకేషన్ కాల్ డేటా ఆధారంగా కూకట్పల్లి లగ్జరీ బాయ్స్ హాస్టల్లో ఉంటున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకింగ్ వివరాలు,ఓటీపీ, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పవద్దని,ఇతరులు మీ ఫోన్లో బ్యాంక్ యాప్లు ఇన్స్టాల్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సందేహాస్పద లావాదేవీలు కనిపిస్తే వెంటనే బ్యాంకును సంప్రదించి 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు పోలీసులు సూచనలు చేస్తున్నారు.






