calender_icon.png 18 December, 2025 | 6:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుది విడత ఎన్నికలకు భారీ బందోబస్తు

16-12-2025 02:18:47 AM

పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ 

సిద్దిపేట క్రైం, డిసెంబర్ 15 : ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 17న అక్కన్నపేట, చేర్యా ల, దూల్మిట్ట, హుస్నాబాద్, కోహెడ, కొమరవెల్లి, కొండపాక, కుకునూరుపల్లి, మద్దూర్ మండలాల్లో ఉదయం 7 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఈ నేపధ్యంలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమల్లో ఉన్నందున ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమిగూడరాదని సీపీ సూచించారు.

పోలింగ్కు 44 గంటల ముందు నుంచి, 15వ తేది సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎన్నికల సభలు, సమావేశాలు, ఇంటింటా ప్రచారం, లౌడ్స్పీకర్ వినియోగం, ర్యాలీలు, బైక్ ర్యాలీలు పూర్తిగా నిషేధమని చెప్పారు. పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపల, ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వెళ్లే మార్గంలో ఎలాంటి ప్రచారం, అడ్డంకులు, ఉద్రేకం, ప్రలోభాలను సృష్టించకూడదని సూచించారు.

పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల పరిధికి వెలుపల అభ్యర్థికి లేదా వారి పక్షాన ఒక్క బూత్ను మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. బూత్ల ఏర్పాటుకు రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా తెలియజేయాలని పేర్కొన్నారు. బూత్ లో ఇచ్చే చీటీలపై అభ్యర్థి పేరు, గుర్తు, రాజకీయ పార్టీ పేరు ఉండకూడదని కేవలం తెల్ల కాగితంపై మాత్రమే ముద్రించాలని తెలిపారు.

పోలింగ్ స్టేషన్ ప్రాంగణంలో , 100 మీటర్ల లోపల ఫోన్లు, కార్డ్లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని హెచ్చరించారు. వైన్ షాపులు 15వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి డిసెంబర్ 18 ఉదయం 10 గంటల వరకు మూసి ఉంచాలని సూచించారు.

ఎవరైనా మద్యం అక్రమంగా రవాణా చేసినా, నిల్వ చేసినా తమ వద్ద ఉంచుకున్నా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా ర్యాలీలు నిర్వహించినట్లయితే కేసులు నమోదు చేస్తామని సీపీ హెచ్చరించారు.