12-07-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 11 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వి కర్ణన్ శుక్రవారం ఉదయం పాతబస్తీలో ప్రసిద్ధిగాంచిన లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై ఆలయ కమిటీ సభ్యులతో కమిషనర్ సమీక్ష నిర్వహించారు.
ఎన్నో రోజులుగా లాల్ దర్వాజా మహంకాళి దేవాలయాన్ని దర్శించాలనే కోరిక ఉండేదని, ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలని కాంక్షించారు.
ఉత్సవాలకు పటిష్టమైన భద్రత: సీపీ
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేస్తు న్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. శుక్రవారం ఆలయంలో జరిగిన శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమా ల్లో ఆయన పాల్గొని, అనంతరం మీడియా తో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని సీపీ స్పష్టం చేశారు.
ఉత్సవాల ఏర్పాట్లపై జీహెచ్‌ఎంసీ, వాటర్ వరక్స్, విద్యుత్, ఆర్ అండ్ బి వంటి అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కూడా సమీక్షలు జరిపి అధికారులకు దిశానిర్దేశం చేశారని తెలిపారు. క్రైమ్ విభాగం పోలీసులతో, షీ టీమ్ బృందాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. సమావేశంలో కమిషనర్ కర్నన్, డీసీపీలు అపూర్వ రావు, స్నేహ మెహ్రా, వెంకటేశ్వర్లు. ఆలయ చైర్మన్ మారుతీయాదవ్ పాల్గొన్నారు.