calender_icon.png 18 November, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో రూ. 2 కోట్ల 75 లక్షల విలువైన 1722 సెల్ ఫోన్స్ రికవరీ

18-11-2025 07:57:09 PM

బాధితులకు అందజేత..

స్పెషల్ డ్రైవ్ ద్వారా 143  మొబైల్ ఫోన్ల రికవరీ

మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు

బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు

జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర..

కామారెడ్డి (విజయక్రాంతి): సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చు అని జిల్లా యం. రాజేష్ చంద్ర మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికీ నిత్యావసరమైనదని అన్నారు, అందులో వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్లు, సోషల్ మీడియా అకౌంట్లు, వ్యక్తిగత ఫోటోలు వంటి కీలకమైన డేటా ఉంటుందని ఎస్పీ తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నవారు కేవలం పరికరాన్ని మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కూడా కోల్పోతున్నారు అని ఆయన అన్నారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న, చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఇవ్వాలని, అలాగే సిమ్ కార్డ్ ను బ్లాక్ చేసి అదే నంబరుతో కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు.

అనంతరం సి ఈ ఐ ఆర్ వెబ్‌సైట్‌లో  ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయడం ద్వారా ఫోన్‌ను సులభంగా గుర్తించి తిరిగి పొందే అవకాశం ఉందని ఎస్పీ  వివరించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆర్.బి.ఐ బాలరాజు  6 మంది కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేయబడింది అని అన్నారు. ఈ సంవత్సరం తొమ్మిదవ దఫాగా గత 15 రోజుల్లో ఈ బృందం 143 మొబైల్ ఫోన్లను రికవరీ చేసింది అన్నారు.

ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 1,722 మొబైల్ ఫోన్లు, సుమారు ₹2.75 కోట్ల విలువగల మొబైల్ ఫోన్లను, బాధితులకు అంద చేసినట్లు  ఎస్పీ  తెలిపారు. పోర్టల్ ప్రారంభం నుండి ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 4,169 మొబైల్ ఫోన్లు (₹6.67 కోట్ల విలువగలవి) రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా 143 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరినీ జిల్లా ఎస్పీ అభినందించడం జరిగింది. ఇప్పటివరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల వివరాలు బాధితులకు తెలపడం జరుగుతుందన్నారు. వారు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్ఐ బాలరాజు (ఫోన్: 8712686114) ని సంప్రదించి సంబంధిత వివరాలు చూపించి తమ మొబైల్ ఫోన్లను స్వీకరించవచ్చు అని తెలిపారు.