15-07-2025 08:45:32 PM
ఖానాపూర్(విజయక్రాంతి): కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ శివారులో భూ హద్దులను గుర్తించేందుకే రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టినట్లు ఆర్డీఓ రత్న కళ్యాణి తెలిపారు. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ శివారులో జరుగుతున్న రెవెన్యూ భూ సర్వే ప్రదేశాన్ని నిర్మల్ ఆర్డీవో రత్నకళ్యాణి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, 2015 సంవత్సరంలో అటవీ శాఖ భూములను పునరావాస గ్రామాల ప్రజల ప్రయోజనాల కొరకు డీనోటిఫై చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. రాంపూర్, మైసంపేట్ పునరావాస గ్రామాల ప్రజలకు చట్ట ప్రకారం భూములు పంచేందుకు అర్హులను గుర్తించామని అన్నారు. ఈ భూముల తుది హద్దులను గుర్తించేందుకే అధికారులు సర్వే చేపట్టారని తెలిపారు. ఈ సర్వేపై ప్రజలెవరూ ఆందోళన చెందవద్దన్నారు. భూ సర్వేకు సంబంధించి సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించాలని తెలిపారు. భూ హద్దుల గుర్తింపు సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు.