29-08-2025 11:48:30 PM
అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు/రామచంద్రపురం: పటాన్చెరు పట్టణానికి చెందిన విద్యార్థి మంగలి నీలకంఠ క్యారమ్స్ క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలోని పాటి గ్రామ పరిధిలో గల సాయి పబ్లిక్ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్న నీలకంఠ ఇటీవల హైదరాబాదులోని హబ్సిగూడ సెయింట్ జోసెఫ్ పాఠశాలలో కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన CICSE గేమ్స్ అండ్ స్పోర్ట్స్ 2025 రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో క్యారమ్స్ అండర్ 17 విభాగంలో నీలకంఠ ప్రథమ స్థానం సాధించారని కోచ్ రమేష్ తెలిపారు. త్వరలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో నీలకంఠ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు.
నీలకంఠను అభినందించిన ఎమ్మెల్యే జిఎంఆర్..
జాతీయస్థాయి క్రీడా పోటీలకు పటాన్చెరు పట్టణానికి చెందిన నీలకంఠ ఎంపిక కావడం సంతోషకరంగా ఉందని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో జరిగే పోటీలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. క్రీడాకారుడు నీలకంఠతో పాటు అతని తండ్రి మంగలి వినోద్, కోచ్ రమేష్ లను ఎమ్మెల్యే జిఎంఆర్ అభినందించారు.