29-08-2025 11:55:23 PM
- బతికుండగానే మట్టిలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నం.
- హత్య ఘటనలో ఏడుగురు పాత్రధారులు.
- ఆరుగురు అరెస్ట్ పరారీలో మరొకరు.
- గుప్తనిధుల వేట బెడిసి కొట్టిన ఘటనలో విస్తుపోయే వాస్తవాలు.
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): గుప్త నిధుల వేట కొనసాగించే ముఠా మధ్యన మనస్పర్ధలు రావడంతో ఒ వ్యక్తి అత్యంత దారుణ హత్యకు గురైన ఘటనలో నాగర్ కర్నూల్ డిఎస్పి బుర్రి శ్రీనివాసులు విస్తుపోయే వాస్తవాలను బయటపెట్టారు. శుక్రవారం హత్యకు పాల్పడిన ఏడుగురిని అరెస్టు చేసి మీడియా వివరాలను వెల్లడించారు.
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన రంగసామి యాదవ్(40) అత్యంత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అచ్చంపేట పట్టణానికి చెందిన పులేందర్ గౌడ్ (పుల్లయ్య గౌడ్) వద్ద ఆరు నెలల క్రితం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పరిచయమైన వీరిద్దరి మధ్య గుప్తనిధుల తవ్వకాల వేట వ్యవహారం నడిచింది. రంగస్వామి తరచూ గుప్తనిధుల తవ్వకాలకు వెళ్తూ తనకు తెలిసిన స్వామీజీ సహాయంతో గుప్తనిధులను బయటికి తెస్తానంటూ పులేందర్ వద్ద ఐదు లక్షలు వసూలు చేశాడు. చాలాకాలంగా గుప్తనిధుల జాడ చెప్పకపోగా మరో ఐదు లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తూ లేదంటే ఆ స్వామీజీ చేత క్షుద్ర పూజలు చేయించి చంపేస్తానంటూ హెచ్చరించాడు.
దీంతో ఎలాగైనా రంగసామిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో పులేందర్ తన అనుచరులతో కలిసి రంగసామి హత్యకు పథకం రచించారు. ఆగస్టు 04, 2025న, కోడేర్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు కాగా ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. ఏదుల పులందర్ గౌడ్ తన సన్నిహితులైన రమేష్, శివ. కర్నాటి సుధాకర్, జక్కుల తిరుపతయ్య, పలుస భాస్కర్ గౌడ్, సలేశ్వర్ గౌడ్ తో కలిసి పదకం వేశాడు. గత నెల జులై 29న డబ్బులు ఇస్తామని నమ్మించి జడ్చర్ల నుంచి రంగస్వామిని మహబూబ్ నగర్ కు తీసుకెళ్ళారు. పుల్లయ్య గౌడ్ తమ్ముడు సలేశ్వర్ గౌడ్ ఇంట్లో చికెన్ లో కల్తీ కల్లులో వినియోగించే అల్ఫాజోలం కలిపి రంగస్వామికి ఇవ్వగా స్పృహ కోల్పోయాడు.
అతన్ని తూఫాన్ వాహనంలో ఎక్కించుకొని బల్మూర్ మండలం మైలారం గ్రామంలోని మామిడి తోటలో పనిచేస్తున్న పలుస భాస్కర్ గౌడ్ వద్దకు తీసుకెళ్లి గడ్డపారాలతో గుంత తవ్వి బ్రతికుండగానే స్పృహ తప్పిన రంగస్వామిని అందులోకి పడేశారు. దీంతో శివ గడ్డపారతో అతని తలపై మోదీ ఉప్పు చల్లి, మట్టితో పూడ్చిపెట్టారు. అనంతరం మద్యం తాగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులు కాగా రమేష్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి ఆరు మొబైల్ ఫోన్లు, ఒక తుఫాన్ వాహనం, శవాన్ని పూడ్చడానికి ఉపయోగించిన రెండు గడ్డపారలు స్వాధీనం చేసుకున్నారు.