23-10-2025 02:06:23 AM
-వైద్య సేవలందక రోగులకు తప్పని కష్టాలు
-అధికారుల్లో సమన్వయ లోపం, నాయకుల ఆంక్షలు
-గట్లమల్యలలో మంత్రి పర్యటన రద్దుతో పిహెచ్ సీ ప్రారంభంలో గందరగోళం
నంగునూరు, అక్టోబర్ 22: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమల్యాలలో రూ.2 కోట్లతో నిర్మించిన పీహెచ్సీ భవనం ప్రారంభోత్సవ వివాదంలో చిక్కుకుంది దాంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సేవలు అటకెక్కాయి. పది గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాయకుల ’ప్రారంభం’ ఆంక్షలు, అధికారుల మధ్య సమన్వయ లోపం రోగుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సామాగ్రి తరలింపు.. గందరగోళం
నూతన భవనం నిర్మాణం పూర్తయి, సీసీ రోడ్డు, ప్రహరి గోడ, ఫర్నిచర్ వంటి ఏర్పాట్లు పూర్తి కాలేదు.. సేవలు ప్రారంభించడానికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గత వారం రోజుల క్రితం వైద్య సిబ్బంది మొత్తం సామాగ్రిని కొత్త భవనానికి తరలించారు. స్థానిక నాయకులు అడ్డుకొని, మంత్రితో ప్రారంభం చేయించాల్సిందేనని పట్టుబట్టి, సేవలను ఆపించారనే విమర్శలు ఉన్నాయి. దీంతో చేసేది లేక సిబ్బంది మళ్లీ సబ్ సెంటర్లోనే సేవలు కొనసాగించాల్సి వచ్చింది.
బుధవారం మంత్రి వివేక్ పర్యటన ఉందని, పీహెచ్సీని ప్రారంభిస్తారని అధికారుల నుంచి ఆదేశాలు అందాయని, సిబ్బంది హడావుడిగా సబ్ సెంటర్లో ఉన్న మొత్తం సామాగ్రిని కొత్త భవనానికి తరలించారు. కానీ రాత్రికి రాత్రే ఓపెనింగ్ కార్యక్రమం రద్దయిందనే సమాచారం అందింది. అధికారులు, నాయకుల సమన్వయ లోపం కారణంగా ఆకస్మికంగా కార్యక్రమం రద్దు కావడంతో బుధవారం ఉదయం వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యం వైద్యం కోసం వచ్చే రోగులు సబ్ సెంటర్కు వచ్చి క్యూలో నిల్చున్నారు. తీరా చూస్తే అక్కడ ఏ ఒక్క ఎక్విప్మెంట్ కూడా లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. రెండు కుర్చీలు, కొన్ని మందులను తీసుకొచ్చి సబ్ సెంటర్ కింద తాత్కాలికంగా సేవలు అందించే దుస్థితి నెలకొంది.
ఇరుకు సబ్సెంటర్లో రోగుల అవస్థలు
ప్రస్తుతం సేవలు అందిస్తున్న సబ్సెంటర్లో ఒకేసారి నలుగురు లేదా ఐదుగురు రోగులు వస్తే స్లున్ పెట్టడానికి ఒకే ఒక బెడ్ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కనీసం వైద్య సిబ్బంది సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా స్థలం లేక కింద కూర్చుని జరుపుకోవాల్సిన పరిస్థి ఏర్పడిందని ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మంత్రి పర్యటన, ప్రారంభోత్సవాల పేరిట పదేపదే వైద్య సామాగ్రిని తరలించడం, మళ్లీ వెనక్కి తీసుకురావడం వల్ల వైద్య సేవలు అర్ధాంతరంగా ఆగిపోయి, ప్రజా ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వైద్య సేవలు ఎక్కడ? సబ్ సెంటర్లోనా, కొత్త భవనంలోనా? అనే విషయంపై అధికారుల్లో స్పష్టత కొరవడడం ఈ మొత్తం వ్యవహారానికి అద్దం పడుతోంది.
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలి...
గట్లమల్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నూతన భవనం పై తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, నూతన భవనంలో వైద్య సేవలు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తాత్కాలికంగానైనా వైద్య సేవలను నూతన భవనంలో కొనసాగించాలని, పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రారంభోత్సవాన్ని చేసుకోవచ్చని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.