30-07-2025 01:24:06 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): బీసీలకు 42శాతం రిజర్వేషన్లు డిమాండ్ చేస్తూ వచ్చే నెల 8న కరీంనగర్‌లో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో బీసీ నేతల సమావేశం జరిగింది. బీసీ రిజర్వేషన్లపై తాము రాష్ట్రపతిని కలుస్తామని చెప్పా రు.
బీసీ రిజర్వేషన్లపై 5,6,7 తేదీల్లో ఢిల్లీకి వెళ్తామని ప్రభుత్వం చెప్పిందన్నారు. బీసీ బిల్లు హడావిడిగా పాస్ చేసి పంపారని, ఆ తర్వాత ఆర్డినెన్స్ తెచ్చారని, దీనితో ఏదో జరిగినట్లు సంబురాలు చేసుకున్నారని విమర్శించారు. ఢిల్లీలో మూడు రోజులు డ్రా మాలు ఆడబోతున్నారని, చివరగా కేంద్రంపై నెపం నెట్టబోతున్నారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్, బీజేపీలు కలసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ప్రజలు కాంగ్రెస్‌ను బొంద పెట్టడం ఖాయమన్నారు. మంత్రివర్గంలో మూడు మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలని, 50శాతం కార్పొరేషన్ పదవులు బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని ఆయన చేశారు.
బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పారని, బీసీల విషయంలో ప్రభుత్వం అభాసు పాలవుతోందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఆర్డినెన్స్ ద్వారా, జీవోల ద్వారా రావని స్పష్టంగా చెప్పామని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, ప్రధాని మోడీని కలసి వినతిపత్రం ఇవ్వకుండా పార్టీ అధ్యక్షులను కలిస్తే ఏం లాభమని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్ అన్నారు.