17-08-2025 01:02:37 AM
సినిమా బండి ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ మేకర్స్ రాజ్, డీకే మద్దతు ఇస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక కాగా.. దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువతో కలిసి విజయ్ డొంకడ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల విలేకరులు సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నిర్మాత విజయ్ ‘సినిమా బండి’కి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన ఒక కొత్త బ్యానర్ ప్రారంభించాలనుకున్నారు. అప్పుడు ఆయనకు ఈ కథ చెప్పాను. చాలా ఎక్సుటై అయ్యారు. తర్వాత అనుపమకు చెప్తే, చాలా ఎమోషనల్ అయ్యారు. ఇందులో అనుపమని గొప్ప పెర్ఫార్మర్‌గా చూస్తారు. ఇప్పటివరకు చూసిన అనుపమ వేరు ఈ సినిమాలో చూసే అనుపమ వేరు.
ఈ సినిమా చూస్తున్నప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. చాలా విషయాలు రిలేట్ అవుతారు. -ఇది ఫిక్షనల్ స్టొరీ. కానీ నిజ జీవితంలో స్ఫూర్తి పొందిన అంశాలున్నాయి. ఇందులో ఒక విషయాన్ని దాచాం. అది ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడే తెలుస్తుంది. మేము ఒక ఫిక్షనల్ ఊరును క్రియేట్ చేసినప్పటికీ సమాజంలో జరిగిన సంఘటనల ఇన్‌స్పిరేషన్స్ మీకు తెరపై కనిపిస్తుంది ఆడవాళ్లలోనే కాదు మగవాళ్లలో కూడా ఒక పరదా ఉంటుందని ఈ సినిమా తెలియజేస్తుంది. ఈ సినిమా ఒక చర్చకు తావిస్తోంది. జనం మాట్లాడుకునే సినిమా అవుతుంది. తెలుగులో చాలా ప్రత్యేక చిత్రం అవుతుందని నమ్మకం ఉంది.
ఈ సినిమా కోసం చాలా వర్క్ చేశాం.. దాదాపు మూడేళ్లు పట్టింది. మనాలి, ధర్మశాల ఇలా ఎన్నో అద్భుతమైన లొకేషన్‌లో 100 మందితో షూట్ చేశాం. -ఎక్కడా గ్రీన్ మ్యాట్ వాడకుండా రియల్ లొకేషన్‌లోకి వెళ్లి షూట్ చేసిన సినిమా ఇది. ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలనే ప్యాషన్‌తో చేశాం.
సినిమాకు ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలు. రివ్యూలు ఎలా వచ్చినా సరే వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాం. సినిమాలో ఏముందో జెన్యూన్‌గా అదే చెప్తారని నమ్ముతున్నాను. రివ్యూస్ చూసే థియేటర్లకి రండి.
మృదుల్ షేన్ డీవోపీగా పనిచేశారు. ఒక అమ్మాయి డీవోపీగా పనిచేయడం తెలుగు సినిమాల్లో చాలా అరుదు. సినిమా చూసిన తర్వాత ఆమె విజువల్స్ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటారు. ఒక బాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.
నేను చిన్నప్పట్నుంచీ మాస్ కమర్షియల్ సినిమాలు చూస్తూనే పెరిగాను. అలాంటి సినిమాలు చేయడం నాకు ఇష్టం. అలాంటి సినిమాలు తీసే అవకాశం రావాలని కోరుకుంటున్నా. అన్ని రకాల సినిమాలు చేయాలనుంది. ముఖ్యంగా కమర్షియల్ సినిమా అంటే పిచ్చి. పేరు వచ్చి అవార్డులు వస్తే సరిపోదు. -ముందు పరదా సినిమాకు డబ్బులు రావాలి. అప్పుడు చాలా మంది ఫిలిం మేకర్స్‌కు ఒక నమ్మకం ఏర్పడుతుంది.