calender_icon.png 6 December, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇండిగో షరామామూలే!

06-12-2025 12:06:53 AM

  1. సంక్షోభంలోనే విమానయాన సంస్థ
  2. దేశీయ సర్వీస్‌లన్నీ నిలిపివేత
  3. నిలిచిన మొత్తం సర్వీస్‌లు వెయ్యికి పైగానే..
  4. నాలుగు రోజులుగా ప్రయాణికుల పాట్లు
  5. కేంద్రం వైఖరే కారణమని రాహుల్ గాంధీ ఆరోపణ
  6. పైలెట్లకు సెలవు నిబంధన ఎత్తివేత
  7. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 5 :  ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోలో తలెత్తిన సంక్షోభం ఇంకా కొనసాగుతోంది.  నాలుగు రోజులుగా విమానాలు రద్దవ్వడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా, ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరాల్సిన ఇండిగో దేశీయ విమాన సర్వీసులు అన్నీ రద్దయినట్టు ఎయిర్‌పోర్టు తెలిపింది.  ఇండిగో సేవలు అందుబాటులో లేక, ప్రత్యామ్నాయ ఎయిర్‌లైన్స్ టిక్కెట్ల ధరలు అమాంతంగా పెరగడంతో వేలమంది ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.  

సిబ్బంది కొరతతో.. 

సిబ్బంది కొరత కారణంగా ఇండిగో  నాలుగు రోజులుగా ఫ్లైట్ సర్వీసులను రద్దు చేస్తోంది. గురువారం ఒక్క రోజే దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 600 పైచిలుకు విమానాలు రద్దయ్యాయి. ఇక శుక్రవారం సైతం 400కి పైగా దేశీయ సర్వీస్‌లు రద్దయ్యాయి. దీనిపై ఎయిర్‌లైన్స్  నుంచి సరైన సమాధానం లేక ప్రయాణికులు తీవ్ర గందరగో ళానికి గురవుతున్నారు.

ఇంకో వైపు లోపలికి వెళ్లిన లగేజీ బ్యాగులు తిరిగి రావడానికి 12 గంటల సమయం పడుతోంది. దీంతో నేలపైనే ప్రయాణికులు సేదదీరుతున్నారు. ఇంకో వైపు ఆహారం, నీరు దొరకక తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సోషల్‌మీడియాలో దుమ్మెత్తి పోస్తు న్నారు. చెత్త ఎయిర్‌లైన్స్ అని ఆగ్రహించారు. 

శంషాబాద్‌లో ఆందోళన

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా నాలుగో రోజైన శుక్రవారం కూడా ఇండిగో 92 విమానాలను రద్దు చేయడంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ వరుస రద్దులతో విసిగిపోయిన ప్రయాణికులు టెర్మినల్ భవనంలో ఆందోళన చేశారు. ఇండిగో సిబ్బందితో తీవ్రవాగ్వాదానికి దిగి, సమాధానం చె ప్పాలంటూ నిలదీశారు. చెక్-ఇన్ ప్రక్రియ పూర్తయ్యాక విమానాలను రద్దు చేస్తున్నారని కొందరు ఆరోపించారు. సిబ్బంది అందుబాటులో లేనప్పుడు విమానాలను ఎందుకు షెడ్యూల్ చేస్తున్నారని ప్రశ్నిస్తూ, ‘షేమ్ షేమ్‘ అంటూ నినాదాలు చేశారు.

చిక్కుకున్న అయ్యప్ప భక్తులు

ముఖ్యంగా కొచ్చి వెళ్లాల్సిన విమానాలు రద్దు కావడంతో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయారు. వారు ‘స్వామియే శరణం అయ్యప్ప‘ అంటూ నినాదాలతో తమ నిరసనను వ్యక్తం చేశారు. అదే సమయంలో విజయవాడ వెళ్లేందుకు వచ్చిన ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి, అయ్యప్ప భక్తుల సమస్యపై స్పందించారు. ఆయన వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌తో ఫోన్‌లోమాట్లా డి, ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని కోరారు. తన విమానాన్ని అందుకోలేకపోయి న పార్థసారథి  చివరకు రోడ్డు మార్గంలో విజయవాడకు బయలు దేరారు.

దేశవ్యాప్తంగా ఎయిర్ పోర్ట్‌లు కిటకిట 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో ప్రయాణికులతో కిటకిటలాడుతున్నా యి. వందలాది మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ కష్టాలు ఇప్పట్లో తీరేటట్లు కూడా కనిపించడం లేదు.  

 టైమ్ పడుతుంది: ఇండిగో సీఈవో  

పైలెట్ల డ్యూటీ షెడ్యూల్ నిబంధనల విషయంలో పొరపాటు పడటంతో ఈ పరిస్థితి వచ్చిందని ఇప్పటికే ఇండిగో ప్రకటించింది. క్షమాపణలు కూడా చెప్పింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని, ఫ్లైట్ సర్వీసు ల రద్దు మరో రెండు రోజులపాటు ఉంటుం దని పేర్కొంది. పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావడం అంత ఈజీ కాదని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ అంగీకరించారు. 

కేంద్రం వైఖరితోనే : రాహుల్ గాంధీ 

దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయానికి  ప్రభుత్వ ఆధిపత్యమే దీనికి ప్రధాన కారణమని  కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు  శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.  ప్రభుత్వ ఆధిపత్యమే ఇండిగో విమానాల రద్దు, ఆలస్యాలకు ప్రధాన కారణాలన్నారు. ఎప్పటిలాగానే ఈ నిస్సహాయతకు సాధారణ పౌరులే మూల్యం చెల్లిస్తున్నారన్నారు.

ఈ సందర్భంగా ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు విమానయాన రంగంతో సహా అన్నింట్లోనూ న్యాయమైన పోటీ ఉండాలని పిలుపునిచ్చారు.  ఈ అంశంపై పార్లమెంటులో చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది రాజ్యసభలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడుకు నోటీసులు ఇచ్చారు.  

రూల్స్ మార్చిన డీజీసీఏ.. 

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్( డీజీసీఏ) తీసుకొచ్చిన కొత్త నిబంధనలు విమానయానరంగాన్ని సంక్షోభంలోకి నెట్టివేశాయి. విమానంలో విధుల్లో ఉండే పైలెట్లకు కచ్చితంగా నెలలో ఏడు రోజుల పాటు సెలవు ఇవ్వాల్సిందేనంటూ తీసుకొచ్చిన కొత్త రూల్ ఇండిగో సంస్థకు శరఘాతంలా తగిలింది. కాస్త సమయం ఇవ్వమని కోరినా అందుకు డీజీసీఏ  నో చెప్పింది.  దీంతో ఆ సంస్థ విమానాలు సిబ్బంది లేక ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

నాలుగు రోజులుగా విమానాశ్రాయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.  పైలెట్ల విధులపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. పైలెట్లకు వారం రోజుల పాటు విశ్రాంతి అనే నిబంధనను తొలగిస్తునట్లు తెలిపింది. కొత్త విధివిధానాలపై అన్ని ప్రైవేటు విమానయాన సంస్థలతో చర్చలు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ఈ నిర్ఱయంతో ఇండిగో ఊపిరి పీల్చుకుంది.