08-01-2026 01:49:27 AM
ఆదిలాబాద్/ఉట్నూర్, జనవరి 7 (విజయక్రాంతి): సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలతో ఘనంగా జరుపుకునే నాగోబా దేవుడి అభిషేకానికి అవసరమైన పవిత్ర గంగా జలంతో మెస్రం వంశీయులు తిరుగు పయాణమయ్యారు. నాగోబా జాతర మహా పూజలో భాగంగా నాగోబా అభిషేకానికి అవసరమయ్యే పవిత్ర గంగాజలం కోసం డిసెంబర్ 31న కేస్లాపూర్‌లోని మురడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు గ్రామ శివారులోని గోదావరి నదిలో గంగా జలం సేకరించుటకు మెస్రం వంశీయులు మహా పాదయాత్రగా బయలుదేరారు.
కేస్లాపూర్ నుంచి గోదావరి నది కోసం చేపట్టిన పాదయాత్రలో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలోని వివిధ మండలాల మీదుగా 205 కిలోమీటర్ల కాలినడకన బుధవారం ఉదయం గోదావరికి చేరుకున్నారు. గోదావరి నదిలో ప్రత్యేక స్నానాలు ఆచరించారు. అనంతరం మెస్రం వంశీయులు పాదయాత్రలో తమ వెంట తీసుకువెళ్లిన గోధుమ పిండి, బెల్లం, పెసర పప్పుతో నది ఒడ్డునే గంగానీళ్లతో ప్రత్యేకంగా తయారు చేసిన అప్పాలను గంగా దేవికి నైవేద్యంగా సమర్పించారు.
అనంతరం మెస్రం వంశీయుల కటోడ మెస్రం హనుమంతరావు, కోసు రావు, ప్రధాన్ మెస్రం దాదేరావు గోదావరిలోని హస్తినా మడుగులోకి దిగి కలశంలో పవిత్ర గంగా జలాన్ని సేకరించారు. గోదావరి నుంచి సేకరించిన పవిత్ర గంగా జలానికి ప్రత్యేక పూజలు చేసి, కేస్లాపుర్‌కు తిరుగు పయాణమయ్యారు. జన్నారం మండలం నుంచి తిరుగు ప్రయాణంలో కుమ్రంభీం జిల్లా సిర్పూర్ (యు) మండలంలోని పిట్టగూడకు గురువారం ఉద యం చేరుకుంటారు. పిట్టగూడా నుంచి జైనూర్ మండలం గౌరీ గ్రామానికి గురువారం సాయం త్రం వరకు చేరుకుంటారు.