27-09-2025 08:24:44 AM
హైదరాబాద్: నాన్‌స్టాప్ వర్షానికి(heavy Rain) హైదరాబాద్ విలవిలాడుతోంది. నగరంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధం అయింది. మూసీ పొంగి వరద నీరు ఎంజీబీఎస్ బస్ స్టాండ్(Mahatma Gandhi Bus Station) ను ముంచెత్తింది. మూసారాంబాగ్, చాదర్‌ఘాట్ లోయర్ బ్రిడ్జిల పై నుంచి వరద జోరుగా ప్రవహిస్తోంది. అటు మూసీ తీరంలోని పలు కాలనీల్లోకి భారీగా వరద నీరు చేరింది. మూసీ ఉధృతితో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎంజీబీఎస్‌ను వరద నీరు చుట్టుముట్టడంతో లోనికి బస్సులు, ప్రయాణికులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
దీంతో ఆర్టీసీ అధికారులు(RTC officials) ఎంజీబీఎస్ ను తాత్కాలికంగా మూసివేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణికులను అధికారులు తరలించారు. ఎంజీబీఎస్ కు రావాల్సిన బస్సులకు ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ఎంజీబీఎస్(MGBS Bus Stand) కు వచ్చే బస్సులకు వేర్వేరుచోట్ల స్టాపులు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం, నల్గొండ నుంచి వచ్చే బస్సులు దిల్ సుఖ్ నగర్ వరకు అనుమతించారు. కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకే సేవలు కొనసాగించనున్నాయి. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ వరకే అనుమతించారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాద్ నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ వరకు తమ సేవలు అందుబాటులో ఉంటాయి. రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులు పికప్ పాయింట్ మార్చినట్లు అధికారులు స్పష్టం చేశారు.