27-09-2025 01:35:38 AM
42% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ఉత్తర్వులు
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): బీసీ సామాజికవర్గాల దశాబ్దాల కల నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. బీసీ రిజర్వేషన్లపై చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేకమైన జీవో నెంబర్ 09ను జారీ చేసింది. ఈ నిర్ణయంతో దాదాపు రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నిక ల నిర్వహణకు మార్గం సుగమమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రత్యేక జీవో విడుదలతో ప్రభుత్వం చేసిన కృషికి ఫలితం లభించ నున్నది. బీసీలకు రిజర్వేషన్ అమలే లక్ష్యంగా రాష్ర్టంలో బీసీల సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేప ట్టింది.
ఈ క్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ బుసాని వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలోని ఏక సభ్య కమిషన్ బీసీల వెనుకబాటుతనంపై సమగ్ర అధ్య యనం చేసి, కీలక సిఫార్సులు చేసింది. రాష్ర్ట జనాభాలో బీసీలు 56.33 శాతం ఉన్నప్పటికీ, వారికి రాజకీయ ప్రాతినిధ్యం తక్కువగా ఉంద ని కమిషన్ నివేదిక వెల్లడించింది. 2024, ఫిబ్రవరిలో నిర్వహించిన సామాజిక, -ఆర్థిక, విద్యా, రాజకీయ, కుల సర్వే సైతం రాష్ర్టంలో బీసీల జనాభా 56.33 శాతంగా ఉందని, కానీ స్థానిక సంస్థల్లో వారికి కేవలం 34 శాతం రిజర్వేషన్లు మాత్రమే లభిస్తున్నాయని తేల్చింది.
భారత రాజ్యాంగంలోని అధికరణలు 243డీ (6), 243టీ(6) స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు సీట్లు, చైర్‌పర్సన్ స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాన్ని రాష్ర్ట ప్రభుత్వానికి కల్పిస్తున్నాయి. ఈ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని, ‘తెలంగాణ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్) బిల్లు, 2025 (ఎల్‌ఏ బిల్ నెం.04 ఆఫ్ 2025)’ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. దీనికి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించడంతో, రిజర్వేషన్లు చట్టబద్ధత పొందాయి.
పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన, బీసీల సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ వెనుకబాటుత నం నివారణ, బీసీల శ్రేయస్సు, సాధికారత, సమాన హక్కులు సాధించడమే లక్ష్యంగా ప్ర భుత్వం జీవో విడుదల చేసింది. ఈ 42 శాతం రిజర్వేషన్లు గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లతో పాటు పట్టణ స్థానిక సంస్థలైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా వర్తిస్తాయి.
దీని ద్వారా బీసీ వర్గాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఎన్నికై, స్థానిక పరిపాలనలో క్రియాశీలకంగా పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇది ప్రజాస్వామ్య వికేంద్రీకరణను మరింత బలోపేతం చేస్తుందని, పాలనలో బీసీల భాగస్వామ్యాన్ని పెంపొందించడం ద్వారా మరింత సమగ్రమైన, సమర్థవంతమైన పాలన సాధ్యమవు తుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది.
పంచాయతీరాజ్ శాఖ సైతం..
రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నం.41 ద్వారా మండల ప్రజా పరిషత్‌లు(ఎంపీపీ), జిల్లా ప్రజా పరిషత్‌లు(జడ్పీపీ) ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
బీసీ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ర్టంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం సీట్లు, పదవులు రిజర్వ్ చేయనున్నట్టు జీవోలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల్లో వెనుకబాటుతనం, కోటా స్వభావం, చిక్కులపై సమకాలీన కఠినమైన విచారణ నిర్వహించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కమిషన్ సిఫార్సుల ఆధారంగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేసినట్టు తెలిపారు.
తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం- సెక్షన్లు 9, 17, 146, 147, 175, 176లను సవరించడం ద్వారా ఈ రిజర్వేషన్లను కల్పించినట్టు స్పష్టం చేశారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్లకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు ఆయా వర్గాల జనాభా నిష్పత్తి ఆధారంగా కేటాయించనున్నట్టు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తిని 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీ జనాభా నిష్పత్తిని 2024 సీపెక్ సర్వే నివేదిక ఆధారంగా నిర్ణయిస్తారని పేర్కొన్నారు.
సీట్ల రిజర్వేషన్ మొదటి సాధారణ ఎన్నికల నుంచి రొటేషన్ పద్ధతిలో జరుగుతుంది. రాబోయే ఎన్నికలను చట్టం ప్రకారం రెండో సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. 2019 ఎన్నికల తర్వాత కొత్తగా నోటిఫై చేసిన స్థానాలకు, ప్రస్తుత ఎన్నికలను మొదటి సాధారణ ఎన్నికలుగా పరిగణిస్తారు. గతంలో చేసిన రిజర్వేషన్లు పరిగణనలోకి రావని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీలలోని మహిళలకు రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించను న్నట్టు జీవోలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్, రాష్ర్ట ఎన్నికల అథారిటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అథారిటీలను ఆదేశించారు.
సర్పంచ్, వార్డు మెంబర్లకు జీవో నం.42
రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నం.42 ద్వారా సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), వెనుకబడిన తరగతులు (బీసీ), మహిళలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచులు, వార్డు మెంబర్లకు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు సీపెక్ సర్వే నివేదిక జనాభా నిష్పత్తి ఆధారంగా కేటాయించనున్నట్టు వెల్లడించారు.
సర్పంచులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ జనాభా నిష్పత్తిని 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీ జనాభా నిష్పత్తిని 2024 సీపెక్ సర్వే నివేదిక ఆధారంగా నిర్ణయిస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీల్లోని మహిళలకు రిజర్వేషన్లు లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నట్టు జీవోలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని డైరెక్టర్, రాష్ర్ట ఎన్నికల అథారిటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, హైదరాబాద్, జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అథారిటీలను ఆదేశించారు.
నేడు కీలక సమావేశం..
ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేయడం ద్వారా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. శనివారం ఉదయం 11 గంటలకు రాష్ర్ట ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సహా ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే రాష్ర్టంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను విడుదల చేసింది. తెలంగాణలో 12,760 పంచాయతీలు, 1,12,534 వార్డులు, 565 జడ్పీటీసీలు, 5,763 ఎంపీటీసీ స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించనున్నారు. అనంతరం పరోక్షంగా 565 మండల పరిషత్‌లు, 31 జిల్లా పరిషత్‌లకు చైర్‌పర్సన్ల ఎన్నికలను నిర్వహిస్తారు. కాగా ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు చేయడానికి వీలుగా, పంచాయత్‌రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు ఈ జీవోను అమలు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ర్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. బీసీలను రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. అగ్రవర్ణమైన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గం బీసీ రిజర్వేషన్ల అమలుకు అహర్నిశలు కృషిచేశారు. బీసీ సమాజం పక్షాన, కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు.
పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
తెలంగాణ చరిత్రలో మరో మైలురాయి
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, సామాజిక న్యాయాన్ని సాధించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఖరారు చేస్తూ, ప్రభుత్వం జీఓ ఇవ్వడం చరిత్రలో మరో మైలురాయి. ఇది వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవానికి, రాబోయే తరాల ఉజ్వల భవిష్యత్‌కు భరోసా. ఇకపై స్థానిక సంస్థల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు లభించనున్నాయి.
-మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి బీసీల గుండెచప్పుడు
సీఎం రేవంత్‌రెడ్డి బీసీ బిడ్డకాకపోయినా రాహుల్ గాంధీ మాట కోసం స్థానిక సంస్థల్లో వారికి 42శాతం రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అనేక అవకాశాలు రాబోతున్నాయి. బీసీలపైన రేవంత్ రెడ్డి అపార ప్రేమ చూపించారు. బీసీల గుండెచప్పుడు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్
బీజేపీ, బీఆర్‌ఎస్‌ను బొందపెట్టాలి
కేంద్రం పట్టించుకోకపోయినా సీఎం రేవంత్‌రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిన పెద్దన్నగా నిలబడ్డారు. బీసీలకు రాజ్యాధికారం రావొద్దని బీఆర్‌ఎస్, బీజేపీ ప్రయత్నం చేశాయి. బీజేపీ,బీఆర్‌ఎస్ పార్టీలను బీసీ బిడ్దలు బొందపెట్టాలి. బీసీ పక్షపాతి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో అండగా నిలబడాలి.
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
రిజర్వేషన్ల పెంపు బీసీల పోరాట విజయం
బీసీ రిజర్వేషన్ల పెంపు బీసీల పోరాట విజయం. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లు 42శాతం పెంచినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, రాష్ట్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు. 20నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీల ఆకాంక్షను గౌరవించి రిజర్వేషన్లు పెంచాకనే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు
జాజుల శ్రీనివాస్‌గౌడ్