calender_icon.png 16 August, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి పాఠశాల గడపకు సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ప్రారంభించిన మంత్రి దామోదర రాజనర్సింహ

16-08-2025 12:00:00 AM

సంగారెడ్డి, ఆగస్టు 15(విజయక్రాంతి): శాస్త్ర ప్రయోగాల కోసం అవసరమైన పరికరాలు, నమూనాలు, ల్యాబ్ సౌకర్యాలను  అమర్చిన ప్రత్యేక వాహనం ప్రతి పాఠశాల వద్దకు నేరుగా వెళ్లి విద్యార్థులకు అక్కడికక్కడే శాస్త్ర ప్రయోగాలను చేయించే సౌకర్యం కల్పించడంతో జిల్లా విద్యా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబడిందని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి దామోదర రాజనర్సింహ్మ తెలిపారు. శుక్రవారం  సంగారెడ్డి జిల్లాలో సంచార విజ్ఞాన ప్రయోగశాలను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్యతో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా విద్యా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టబడిందని, విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి, సృజనాత్మకతను వెలికితీయడానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేరుగా పాఠశాల గడపకు తీసుకెళ్లే సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ ని ప్రారంభించడం జరిగిందన్నారు.

జిల్లాలోని మారుమూల పాఠశాలల్లో అన్ని రకాల సైన్స్ పరికరాలు అన్ని పాఠశాలలో లభ్యం కాకపోవచ్చని, విద్యార్థులు పరిశోధన చేయడానికి, అనువుగా ఉండడానికి వీలుగా మొబైల్ సైన్స్ ల్యాబ్ అన్ని పాఠశాలలకు వెళ్తూ అందరు విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని కలిగించడానికి వీలవుతుంద న్నారు. దీని ద్వారా జిల్లాలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాల విద్యార్థులకు కూడా ప్రయోజనం కలుగుతుందన్నారు.

ఈ ప్రత్యేక వాహనంలో భౌతిక శాస్త్రం (50), రసాయన శాస్త్రం (30), జీవ శాస్త్రం (70), గణిత శాస్త్రం (60), సామాజిక శాస్త్రం (50) వంటి విభాగాల్లో మొత్తం 250కు పైగా ప్రయోగాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.