calender_icon.png 17 August, 2025 | 3:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల గోల్ మాల్... నిందితుల అరెస్టు

16-08-2025 06:25:16 PM

సూర్యాపేటలో నిందితుల వివరాలు మీడియా ముందు వెల్లడించిన జిల్లా ఎస్పీ

నిందితుల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పీఏలు

ఆరుగురు నిందితుల నుండి రూ.9.30 లక్షలు నగదు, 6 చెక్కులు స్వాధీనం

కోదాడ,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల గోల్ మాల్ వ్యవహారంలో  నిందితులను కోదాడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలో  శనివారం ఎస్పీ కె.నరసింహ వెల్లడించారు. చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన చెడపంగు నరేష్ మేళ్లచెరువు మండలం వేపల మాదారం గ్రామానికి చెందిన మరల వీరబాబు, మోతె మండలం సర్వారంకు చెందిన ఉప్పుల మధు, మునగాల మండలం నారాయణ గూడెంకు చెందిన సురగాని రాంబాబు గౌడ్, వరంగల్ జిల్లా రంగసాయిపేటకు చెందిన గుంటుక సందీప్, మేళ్లచెరువు మండలం రామాపురం గ్రామానికి చెందిన రంగిశెట్టి వెంకటరావులు ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి ఈ వ్యవహారం నడిపినట్లు తెలిపారు.  వీరిలో కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ క్యాంప్ ఆఫీసులో సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా  పనిచేసిన చెడపంగు నరేష్ తో  పాటు పిఏలుగా పనిచేసిన మరల వీరబాబు, ఉప్పల మధులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పర్యవేక్షించే వారన్నారు.

2023 నవంబర్ నెలలో జనరల్ ఎలక్షన్ కోడ్ వస్తుందని వారి వెంట తిరిగే సురగాని రాంబాబుతో కలిసి వివిధ పేర్లతో ఉన్న 44 సీఎంఆర్ ఎఫ్ చెక్కులను (విలువ రూ.15,83,500) పక్కన పెట్టారన్నారు. తదుపరి అట్టి చెక్కులను రీవాల్యుషన్ చేయించుకొని అదే పేర్లతో ఉన్న వేరే వ్యక్తులను చూసి వారి అకౌంట్లో డబ్బులు జమ చేయించి తీసుకోవాలని పథకం పన్నారన్నారు. శాసనమండలిలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న గుంటుక సందీప్ వ్యక్తి ద్వారా రివల్యూషన్ చేయించి అదే పేర్లతో ఉన్న వేరే వ్యక్తుల అకౌంట్లో చెక్కులు జమ చేయించి అట్టి డబ్బులను అసలైన లబ్ధిదారులకు చెందకుండా వారు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల అకౌంట్ ల నుండి డ్రా  చేసుకొని అందరూ కలిసి డబ్బులు పంచుకున్నట్లు వెల్లడించారు. ఈ వ్యవహారంలో గుంటుక సందీప్ నుండి డ్రా చేయని ఆరు చెక్కులు నేరానికి వాడిన ఐదు సెల్ ఫోన్ లు, అకౌంట్ ల నుండి డ్రా చేసిన నగదులో వారి ఖర్చులు పోను మిగిలిన రూ.9.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మోసం చేసి బ్యాంక్ ల నుండి డ్రా చేసిన 36 చెక్కుల మొత్తం నగదు  రూ.13.63 లక్షలు  ఉందన్నారు. అలాగే విత్ డ్రా కానీ 8 చెక్కుల విలువ రూ.2.20,500 ఉన్నదన్నారు.  మాజీ ఎమ్మెల్యేకు తెలియకుండా స్వార్థపూరితంగా ఈ నేరానికి పాల్పడినట్లు ఎస్పీ వెల్లడించారు .ఈ  కేసును త్వరితగతిన ఛేదించడానికి పర్యవేక్షణ చేసిన డిఎస్పి శ్రీధర్ రెడ్డి, చాకచక్యత ప్రదర్శించిన కోదాడ టౌన్ సిఐ శివశంకర్, ఎస్సై హనుమాన్ నాయక్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, హరికృష్ణ, హెడ్ కానిస్టేబుల్ కరుణాకర్, శ్రీనివాసు సైదులు, ఆనంద్, మల్లేష్ , సతీష్, శివకృష్ణ, ప్రభాకర్, హెడ్ కానిస్టేబుల్ బాల్త శ్రీనివాస్, కానిస్టేబుల్స్ ఎల్లారెడ్డి, సతీష్ నాయుడు, రాంబాబులను ఎస్పీ  అభినందించి రివార్డులను అందజేశారు. కాగా మాజీ ఎమ్మెల్యే వద్ద అన్నీ తామై చేసిన ఇద్దరు పీఏలు ఈ ఘటనలో భాగస్వాములుగా ఉండగా ఇతరుల పాత్ర లేదనడం పట్ల పలువురు అనుమానాలను వ్యక్తం చేస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది.