16-08-2025 06:29:23 PM
జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని, గతంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం మొరంచపల్లి వాగు ఉదృతిని ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాగు ఉదృతి దృష్ట్యా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినపుడు తక్షణమే స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు. ఎగువ భాగం నుండి ఎంత వరద వచ్చే అవకాశం ఉందన్న వివరాలు ఈఈ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని వరద పరిస్థితిని ముందుగా అంచనా వేసి ప్రజలను ముందస్తు అప్రమత్తం చేయాలని సూచించారు.
వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాకు ఆదివారం వరకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సిబ్బంది కార్యస్థానాల్లో అందుబాటులో ఉండి రక్షణ చర్యలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు..భారీ వర్షాలు దృష్ట్యా ప్రజల, పశువుల ప్రాణరక్షణలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంపు ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర సేవలకు ప్రజలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నంబర్ కు కాల్ చేయాలని సూచించారు. 90306 32608 ద్వారా వచ్చిన ఫిర్యాదులకు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పశువులను మేతకు బయటికి పంపకుండా ఇంటి పట్టునే ఎత్తైన ప్రదేశంలో ఉంచాలని తెలిపారు. రహదారులపై నీళ్లు చేరిన ప్రాంతాల్లో ప్రజలు ప్రయాణాలు చేయకుండా పటిష్ట నియంత్రణ చేయాలని తెలిపారు. అత్యుత్సాహంతో ఎవరైనా దాటే ప్రయత్నం చేసే అవకాశం ఉన్నందున రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్ సిబ్బంది పటిష్ట పర్యవేక్షణలో బారికేడ్లు ఏర్పాటు చేసి రవాణా నియంత్రణకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.