08-01-2026 12:56:47 AM
పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యే
నిర్లక్ష్యం చూపుతున్న ప్రభుత్వం
మాజీ మంత్రి జోగు రామన్న
ఆదిలాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రైతు సమస్యల ముందు ఎలాంటి పదవులు ముఖ్యం కాదని, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ జిల్లా రైతుల పక్షాన అసెంబ్లీలో నిరసన చేయాల్సింది పోయి పదవులను అనుభవించడం సిగ్గుచేటని మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. జిల్లాలో రైతుల ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆదిలాబాద్ బంద్ విజయవంతమైందన్నారు. బంద్‌కు మద్దతు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ట్రేడర్స్ ప్రతినిధులకు, వ్యాపార వాణిజ్య సంస్థల వారికి, చిరు వ్యాపారస్తులకు సైతం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి రామన్న మాట్లాడారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి బంద్ ను విజయవంతం చేసినప్పటికిని, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, కాంగ్రెస్ నాయకులకు మాత్రం కనువిప్పు కలగడం లేదన్నారు. ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచడంలో కనీస బాధ్యతను చూపలేక స్థానిక నాయకులు విఫలమయ్యారన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనాలోచిత మాటలు రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యాయని ఆరోపించారు.
రంగు మారిన పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కనీసం ఇప్పటి వరకు పంట బీమా అందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. రైతుబంధు, యూరియా కొరత, కపాస్ కిసాన్ యాప్, రైతుల పాలిట శాపంగా మారుతున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని కనీస బాధ్యతగా వ్యవహరిస్తూ పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. కార్యక్రమంలో నాయకులు అజయ్, యాసం నర్సింగ రావు, ప్రహ్లాద్, బుట్టి శివ, పరమేశ్వర్, కుమార్ రాజు, దమ్మ పాల్, కొండ గణేష్, నవాతే శ్రీనివాస్, సంజయ్, షాదుల్లా, వెంకట్ రెడ్డి, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.