24-01-2026 12:36:01 AM
జనగామ, జనవరి 23 (విజయక్రాంతి): మహిళల ఉన్నతితోనే తెలంగాణ ప్రగతి సాధిస్తుందనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సంకల్పంగా పెట్టుకున్నారని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంతో పాటు పాలకుర్తిలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. జనగామలో బస్టాండ్, బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన స్వాగత శిల్పాలను ప్రారంభించారు. బతుకమ్మ కుంటలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్, వెజ్ నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రారంభించారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను అందించి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతీ మహిళ మహిళా సంఘంలో సభ్యత్వం తీసుకోని వివిధ వ్యాపారాలు చేసి ఆర్ధికంగా ఎదిగి కుటుంబానికి భరోసా ఇవ్వాలన్నారు. 40 వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను అందిస్తు మహిళల ఆర్ధికభివృద్ధి కి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు.
సోలార్ ప్లాంట్, పెట్రోల్ బంక్, ముదిరాజ్ కులస్తులకు వారి వ్యాపారం కోసం మొబైల్ వ్యాన్ మంజూరు, ఫంక్షన్ హల్ ఇలా ప్రతీ వ్యాపార రంగంలో మహిళలను భాగస్వామ్యం చేస్తున్నట్లు చెప్పారు. మహిళా సంఘాల సభ్యులు ఎవరైనా ప్రమాద వశాత్తు చనిపోతే వారి కుటుంబం ఆగం కావద్దని 10 లక్షల భీమా సొమ్ము, లోన్ భీమా కింద 2 లక్షల రూపాయలు అందుతాయన్నారు. ఆడపిల్ల అంటే భయపడొద్దని, చదివించి వారికి ఉన్నతమైన స్థానంలో నిలబడేంత వరకు తల్లిదండ్రులు అండగా ఉండాలని సూచించారు.