15-07-2025 02:00:38 PM
హైదరాబాద్: శామీర్ పేట జీనోమ్ వ్యాలీలో(Shamirpet Genome Valley) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం పర్యటించారు. జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... సీబీఆర్ఈ ర్యాగింగ్స్ లో హైదరాబాద్ చోటు దక్కించుకుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) తెలిపారు.
బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో వంటి నగరాల సరసన హైదరాబాద్ చేరిందని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్(Hyderabad Real Estate) పడిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జీనోమ్ వ్యాలీ ఆసియా ఖండంలోనే ప్రత్యేకమైందిగా గుర్తింపు పొందిందని మంత్రి పేర్కొన్నారు. జీవశాస్త్రాల అభివృద్ధికి అవసరమైన ఎకోసిస్టమ్ హైదరాబాద్ లో ఉందని తెలిపారు. పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలో సీఎం ముందున్నారని మంత్రి వివరించారు. మంచిగా ఉన్న ఏ విధానాన్నీ మేం అధికారంలోకి వచ్చాక మార్చలేదని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధి కోసం మంచి విధానాలను కొనసాగించామని చెప్పారు. 23 శాతం సీఏజీఆర్ ను తెలంగాణ నమోదు చేస్తోందన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సైన్స్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.