calender_icon.png 16 October, 2025 | 8:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా ఘోష వినండి సార్లూ!

16-10-2025 02:13:21 AM

  1. అద్దె భవనంలో నిర్వాహణ

పిల్లర్ దశలో ఆగిన నిర్మాణం

భవన నిర్మాణంపై అధికారుల పట్టింపేది..? 

నూతన పాలక మండలికి తిప్పలు తప్పేనా

వేములపల్లి అక్టోబర్ 15 ( విజయ క్రాంతి): అంగట్లో అన్ని ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది గ్రామపంచాయతీ నిర్మాణ పనులు. వేములపల్లి మండలంలోని మంగాపురం గ్రామపంచాయతీ భవన నిర్మాణంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. నేను మీ గ్రామపంచాయతీని నా నిర్మాణా పనులు చేపట్టి మధ్యలోనే వదిలేశారు. రివ్యూ చేపట్టాల్సిన అధికారులు ఇప్పటివరకు నా వైపు చూడడం లేదు.

ఏ ఒక్క అధికారైన నా గురించి మాట్లాడుకుంటున్నారా అనే సందేహం కలుగుతుంది. నాతోపాటు మొదలైన లక్ష్మీదేవి గూడెం గ్రామపంచాయతీ భావన నిర్మాణం పూర్తి అయ్యి కళకళలాడుతుంది. కానీ నన్ను మాత్రం పట్టించుకోవడంలేదని  గ్రామపంచాయతీ భవనం వాపోతోంది. ఇంకా ఎన్నాళ్లు మోడు బారిన చెట్టుల నాకు ఈ నిరీక్షణ అని గ్రామపంచాయతీ భవనం ప్రశ్నిస్తుంది.2022 -23వ సంవత్సరంలో అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు 20 లక్షల రూపాయల వ్యయంతో శంకుస్థాపన చేశారు.

టెండర్ ప్రక్రియ పూర్తిచేసుకుని పనులు చేపట్టారు. మూడేళ్ల క్రితం నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం, ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడంతోనే పిల్లర్ లెవెల్ లో నిలిచిపోయిందంటూ గ్రామస్తులు బహిరంగంగానే మండిపడుతున్నారు. పిల్లర్ల లెవెల్ రాగానే కాంట్రాక్టర్ అర్ధాంతరంగా వదిలేశారు.గత ఐదు సంవత్సరాల క్రితం సల్కునూరు గ్రామం నుండి వేరుచేసి మంగ పురం గ్రామాన్ని నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారు. గ్రామంలో సుమారు 220 ఇండ్లు ఉన్నాయి. అదేవిధంగా 765 మంది ఓటర్లు ఉన్నారు.

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

గ్రామపంచాయతీ భవనం లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. పంచాయతీ భవన నిర్మాణం మొదలుపెట్టి మూడు సంవత్సరాలు దాటిన ఇప్పటికీ పూర్తి కాలేదు. నిర్మాణంపై పట్టించుకోవాల్సిన ఉన్నత అధికారులు ఇటువైపు కూడా చూడడం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆసరా పెన్షన్ తీసుకునే వారు గ్రామ ప్రజల సమస్యలు పరిష్కారానికై సమావేశం నిర్వహించడానికి సరైన ఆఫీసు లేక ఇబ్బందులు పడుతున్నారు. 

నూతన పాలక మండలికి చోటేదీ

త్వరలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అనంతరం నూతన పాలకమండలి కొలువు తీరనుంది. కానీ గ్రామపంచాయతీ భవన నిర్మాణం పూర్తి కాకపోవడంతో నూతనంగా ఏర్పడే గ్రామ పాలక మండలికి చోటే లేదు అనే చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతానికి ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలంటే పంచాయతీ భవనం లేక రోడ్లపైనే రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసుకున్నట్లు గ్రామ ప్రజలు వాపోతున్నారు.  కొత్తగా వచ్చే పాలకమండలికి కూడా ఈ తిప్పలు తప్పేలా లేదు.

వివరాలు నా దగ్గరికి రాలేదు: బిందు, పిఆర్ ఏఈ వేములపల్లి నేను మండల ఏఈగా చార్జి తీసుకుని ఆరు నెలల అవుతుంది. అంత ముందు ఉన్న వివరాలు నా దగ్గరికి రాలేదు.