18-11-2025 11:18:26 PM
ట్రస్టీలకు సంబంధించిన భూములపై గట్టిగా వాదించాలని దేవాదాయ శాఖ నిర్ణయం
ఎండోమెంట్ ట్రిబ్యునల్ టీమ్ ఏర్పాటుకు సన్నాహాలు
సవిల్ సప్లయీస్ తరహాలో విజిలెన్స్ టీమ్
దేవాదాయ భూములపై మంత్రి సురేఖ పలుమార్లు సమీక్ష
హైదరాబాద్ (విజయక్రాంతి) : దేవుడి భూములపై న్యాయపోరాటం చేసేందుకు సర్కారు సమాయత్తమైంది. కబ్జాకు గురైన దేవుడి భూములు కాపాడటంలో లీగల్ టీం పాత్ర చాలా కీలకమైందని దేవాదాయ శాఖ భావిస్తోంది. దేవాదాయ శాఖకు సంబంధించిన కేసుల్లో రీట్ పడిన దగ్గరి నుంచి కేసు పూర్తయ్యేవరకు కీలకంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. 2002 నుంచి 2025 వరకు 1,500 కేసులు పెండింగులో ఉండగా.. ఈ మధ్యలోనే 543 కోర్టు కేసులను డిస్పోజ్ చేసినట్టు దేవాదాయ శాఖకు నివేదిక అందింది. ఈ విషయమై రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పలుమార్లు సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అంతే కాకుండా గవర్నమెంటు ప్లీడర్లతోనూ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి సురేఖ సమావేశమయ్యారు. దేవాదాయ భూములను కబ్జాలు, అన్యాక్రాంతానికి పాల్పడుతున్న వారిపై ఏ విధంగా శిక్షించాలి, ఏ సెక్షన్లు అన్న దానిపై చర్చించారు. భూముల అన్యాక్రాంతానికి సంబంధించిన కేసుల పురోగతిపై మంత్రి వివరాలు సేకరించారు. ఎండోమెంటు ట్రిబ్యూనల్ అపాయింట్ చేయాల్సిన అవసరం ఉందని గుర్తించారు.
ట్రస్టీలకు సంబంధించిన కేసుల్లో గట్టిగా వాదించాలనే నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే, ఆర్కియాలజీ డిపార్టుమెంటు దగ్గర వివరాలు సేకరించాలని, ఆ సమాచారాన్ని సాక్ష్యంగా తీసుకోని వెళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. అందుకోసం ఒక నిపుణుల కమిటీ నియమించాలని, దైవచింతన కల్గిన వ్యక్తులు ఈ పనిలో నిమగ్నమైతే మంచిదని దేవాదయ శాఖ భావిస్తోంది. ఎండోమెంటు కేసుల్లోని కంటెప్ట్ ఆఫ్ కోర్టు అంశాలు తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వీటి విషయంలో హైకోర్టులను పిలిచేదాకా వెళుతున్న పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిణామాలు జరగకుండా ఉండాలని భావిస్తుంది. ఈ విషయంలో న్యాయ విభాగ టీం, వారి కింద వ్యవస్థ సరైన టైంలో ఎండోమెంటు ఉన్నతాధికారులను అలర్ట్ చేస్తే ఇబ్బందులు ఉండవని సంబంధిత అధికారులు చెబుతున్నారు. అయితే దేవాదాయ శాఖ భూములు కాపాడేందుకు ప్రభుత్వ అనుమతితో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సివిల్ సప్లయీస్ డిపార్టమెంటులో ఉన్న మాదిరిగా ఉండాలని, ఇక కౌంటర్లు వేయడంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని అభిప్రాయంతో ఉన్నారు.