calender_icon.png 19 November, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత వస్త్ర పరిశ్రమ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు కేటాయించాలి

18-11-2025 11:38:32 PM

ఇండియా వీవర్స్ ఫెడరేషన్ 

ఖైరతాబాద్ (విజయక్రాంతి): చేనేత వస్త్ర పరిశ్రమ అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం పదివేల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్  రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో చేనేత సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వివక్ష  అనే అంశంపై  ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర  అధ్యక్షులు బాసబత్తిని రాజేశం అధ్యక్షత అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి  తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం, బిసి ఇంటిలెక్చ్యువల్ ఫోరమ్ చైర్మన్ చిరంజీవులు, మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపాక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు, బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతి కుమార్ తదితరులు హాజరై మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం చేనేత రుణమాఫీని వెంటనే అమలు చేయుటకు తగిన నిధులు విడుదల చేయాలని అన్నారు. చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ రుణాలను వెంటనే రద్దు చేయాలని, పేరుకుపోయిన వస్త్రాలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి చేనేత కార్మికులను ఆదుకోవాలని తీర్మానించారు. చేనేత సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.

ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు చేనేత కార్మికులకు జీవితకాలం ఆరోగ్య భీమా, జీవిత బీమా 10 లక్షల రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు.చేనేత ముడిసరుకులపై విధించిన 5% జిఎస్టి ని, చేనేత వస్త్రాలపై పెంచిన 18%  జిఎస్టి ని వెంటనే రద్దు  చేయాలని కోరారు. ఇటీవల మరణించిన సహజ కవి అందేశ్రీ, బస్సు ప్రమాదం లో మరణించిన వారికి ఈ సందర్భంగా సంతాపం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో చేనేత సంఘం అధ్యక్షులు పాశికంటి లక్ష్మినర్సయ్య , పోచంపల్లి సహకార సంఘం అధ్యక్షులు భారత వాసుదేవ్, కర్నాటి ధనుంజయ, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి చోల్ రాజేశ్వర్, కోశాధికారి గవ్వల శంకర్, కోఆర్డినేటర్ గడ్డం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.