19-11-2025 12:00:00 AM
కుంటాల, నవంబర్ 18(విజయక్రాంతి): పదిమందికి అన్నం పెట్టి రైతులం మేము.. ఎండనక వాననక కష్టపడి సోయా పంట పండిస్తే పంట విక్రయించుకున్నాక నాసిరకం అంటూ తిరిగి పంపుతారా ఇదెక్కడి న్యాయం అంటూ కుంటాల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటాల సొసైటీ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన సోయపంటను నాఫెడ్ అధికారులు నాణ్యత పేరుతో వాపస్ పంపడంపై ఆగ్రహించిన రైతులు బైంసా నిర్మల్ 61 వ జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో నిర్వహించారు.
వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలివచ్చి కల్లూరు గ్రామ వద్ద సోయా బ్యాగులను రోడ్డుపై పెట్టి నిరసన తెలిపారు విషయాన్ని తెలుసుకున్న రాజకీయ పార్టీ నాయకులు వారికి సంఘీభావంగా తరలివచ్చి మద్దతు పలకడంతో రాస్తారోకో మరింత ఉధృ్ధతమైంది.వాపస్ పంపిన సోయపంటలు కొనుగోలు చేసే వరకు రాస్తారోకో విరమించబోమని ప్రకటించడంతో ఈ విషయాన్ని కుంటాల ఎస్‌ఐ అశోక్ మార్క్‌ఫెడ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
రైతుల ఆందోళనతో కిలోమీటర్ల పొడుగునా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు రైతులతో మాట్లాడి నా తమకు న్యాయం జరిగే వరకు రాస్తారోకో విరమించబోమని స్పష్టం చేశారు. అక్కడికి చేరుకున్న మార్క్‌ఫెడ్ అధికారి మహేష్‌పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంట గోదాములకు తరలించిన తర్వాత ఇప్పుడు నాణ్యతగా లేదని తిరిగి పంపిస్తే ఆ పంట ఎక్కడ అమ్ముకోవాలని నిలదీశారు.
ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు సంప్రదించి వాపస్ తీసుకొచ్చిన సోయపంటను తిరిగి కొనుగోలు చేస్తామని అధికారి హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు భాస్కర్ దీక్షిత్ పటేల్ పడకంటి దత్తు జక్కుల మహేష్ గజేందర్ దశరథం పోశెట్టి తదితరులు ఉన్నారు.