calender_icon.png 26 September, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిరాజ్ సినిమాస్, ఆనంద్ మాల్ అండ్ మూవీస్

26-09-2025 01:24:27 AM

-నార్సింగిలో కొత్త థియేటర్ ప్రారంభం

-హాజరైన దిల్ రాజు, ఆర్ నారాయణమూర్తి, రామేశ్వరరావు 

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): నార్సింగి ప్రాంతంలో కొత్తగా మిరాజ్ సినిమాస్, ఆనంద్ మాల్ అండ్ మూవీస్ ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మైహోం గ్రూప్ చైర్మన్ రామేశ్వరరావు, సినీ నిర్మాత దిల్ రాజు, ప్రముఖనటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, రఘురామ్ గ్రూప్ ఎండీ డాక్టర్ అనందరావు, మిరాజ్ సినిమాస్ ఎండీ భువనేశ్ హాజరయ్యారు. నాలుగు అత్యాధునిక డాల్బీ డిజిటల్ స్క్రీన్లు, 801 సీట్ల సామర్థ్యంతోపాటు అదనంగా సాఫ్ట్ సీటింగ్ కూడా ఉన్న మిరాజ్ సినిమాస్ అంతర్జాతీయ స్థాయి సినీ అనుభవాన్ని అందిస్తుంది. మొత్తం 2 లక్షలకు పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆనంద్ మాల్ అండ్ మూవీస్‌లో గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం డిమార్ట్ ఉంటుంది.

మొదటి, రెండో అంతస్థుల్లో బాంక్వెట్ హాల్స్, గెస్ట్ రూంలు ఉంటాయి. నాలుగో అంతస్థులో మినర్వా కాఫీషాప్, ఐదు, ఆరో అంతస్థులలో మిరాజ్ సినిమాస్ ఉంటాయి. ఈ సముదాయంలో 4 బేస్‌మెంట్ పార్కింగ్ లెవెల్స్ (బీ1, బీ2, బీ3, బీ4) ఉన్నాయి.  దాంతో ద్విచక్రవాహనాలు, కార్లపార్కింగ్‌కు కావల్సినంత స్థలం ఉంటుంది. డాక్టర్ జె రామేశ్వరరావు, మైహోం గ్రూప్ ఛైర్మన్ మాట్లాడుతూ.. “నార్సింగి ప్రాంతం ఆధునిక జీవనశైలికి కేం ద్రంగా ఎదుగుతోంది. ఆనంద్ మాల్ అండ్ మూవీస్ సంస్థ మిరాజ్ సినిమాస్‌తో కలిసి వస్తుండడం ఈ ప్రాంతానికి ఒక ల్యాండ్ మార్క్ అవుతుంది” అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ.. “హైదరాబాద్ నగరానికి సినిమాలే ఊపిరి.

ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాలకు దగ్గర్లో ప్రీమియం థియేటర్లు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే” అన్నారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. “వినోదం అంటే కేవలం సినిమా మాత్రమే కాదు. అన్ని ఆనందాలూ పంచుకోవడం. ఈ మల్టీప్లెక్స్ వల్ల అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ, కంఫర్ట్ రెండూ లభిస్తాయి” అన్నారు. రఘురామ్ గ్రూప్ ఎండీ డాక్టర్ ఆనందరావు మాట్లాడుతూ.. “షాపింగ్, వినోదం, సరదాగా కాలం గడిపే ప్రదేశం అన్నీ ఒకచోట ఉండాలని మేం ఆనంద్ మాల్ అండ్ మూవీస్ ఏర్పాటుచేశాం. మిరాజ్ సినిమాస్ కూడా ప్రారంభం అవడంతో మా విజన్ పూర్తయింది” అన్నారు.