ఆ విద్యార్థుల చదువులు సాగేదెలా?

26-04-2024 02:06:21 AM

400 ఇంటర్ కాలేజీలకు ముగిసిన మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ గడువు

సెకండియర్‌లో చేరాల్సిన విద్యార్థుల పరిస్థితి  అయోమయం 

ఏం చేయాలన్న దానిపై ఇంటర్ బోర్డు అధికారుల తర్జనభర్జన

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల నిర్లక్ష్యం, ఇంటర్ బోర్డు అధికారుల ఉదాసీనతతో వేలాది మంది విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారనున్నాయి. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ‘అనుబంధ గుర్తింపు’ గడువు ముగిసిన ప్రైవేట్, కార్పొరేట్ ఇంటర్ కళాశాలలు రాష్ట్రంలో దాదాపు 400 ఉన్నాయి. వీటిలో సుమారుగా 60 వేల నుంచి 80 వేల మంది వరకు చదువుతున్నారు. ఈ మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో కొనసాగుతున్న ఇంటర్ కళాశాలలకు గతంలో ఇంటర్ బోర్డు రెండేళ్ల పాటు ప్రత్యేక అనుమతిని ఇచ్చింది. అయితే ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు ఈ 2023 విద్యా సంవత్సరంతో ముగిసిపోయింది.

జూన్ 1 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. అప్పట్లో ఈ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ బోర్డు రెండేళ్ల పాటు ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది. కానీ గతేడాది ఆయా కాలేజీల్లో ఫస్టియర్‌లో చేరే విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మాత్రం అండర్ టేకింగ్ లెటర్‌ను తీసుకోవాలని కాలేజీలకు ఆదేశాలిచ్చింది. ఇందులో భాగంగానే ‘వచ్చే విద్యాసంవత్స రం కళాశాలకు గుర్తింపు రాకున్నా.. ఈ కాలేజీలో ఇప్పుడు చేరడం మాకిష్టమే’ అని గతే డాది అండర్ టేకింగ్ తీసుకున్నారు. ఇప్పు డు ఆ 400 కాలేజీలకు గడువు ముగిసింది. గతేడాది ఫస్టియర్‌లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు ఇప్పుడు సెకండియర్‌కి వెళ్లనున్నారు. ఇప్పుడు ఆ కాలేజీలకు మిక్స్‌డ్ ఆక్యు పెన్సీ గుర్తింపును ఇంటర్ బోర్డు ఇస్తుందా.. లేదా అన్న అయోమయం నెలకొంది. 

ప్రతి ఏడాది ఇదే తీరు..

రాష్ట్రంలో 1580 ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలున్నాయి. వీటిలో చాలా వరకు బహుళ అంతస్తుల భవనాలు, ఇరుకు ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. అయితే 2024 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్ (అనుబంధ గుర్తింపు)కు ఇంటర్ బోర్డు ఫిబ్రవరి 24న నోటిఫికేషన్ విడుదల చేసింది. కళాశాలల యాజమాన్యాలు మార్చి 31 వరకు ఎలాంటి ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. రూ.1000 ఫైన్‌తో ఈ నెల 7 వరకు, రూ.5 వేల ఫైన్‌తో ఈ నెల 14 వరకు, రూ.10 వేల ఫైన్‌తో ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే రూ.20 వేల ఫైన్‌తో మే 5 వరకు దరఖాస్తు చేసుకునేందుకు బోర్డు అవకాశం కల్పించింది. అఫిలియేషన్ కోసం ఇప్పటి వరకు దాదాపు 1350 వరకు కాలేజీలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. అయితే వీటిలో మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీలూ ఉన్నాయి.

గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఈ కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతినిస్తుందా.. లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రతి విద్యా సంవత్సరంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని కళాశాలలకు అను మతి ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆయా కాలేజీల యాజమాన్యాలు విజ్ఞప్తి చేయడం, వాటికి అనుమతినివ్వడం షరామామూలు అన్నట్లుగా తయారైంది. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీలో ఉన్న కాలేజీలు నిబంధనలు పాటించకుండా, అనువైన ప్రాంతాల్లోకి మార్చకుం డానే రాబోయే 2024 విద్యా సంవత్సరానికి కూడా ఇప్పటికే అడ్మిషన్లను చేపట్టాయి. కొత్త విద్యా సంవత్సరానికి ఒకవేళ అనుమతి రాకుంటే సెకండియర్‌కు వెళ్ల బోతున్న సుమారు 60 నుంచి 80 వేల మంది విద్యార్థులతో పాటు ఫస్టియర్‌లో చేరబోతున్న వేలాది మంది విద్యార్థుల చదువులు కూడా అయోమయంలో పడినట్లే. అయితే ఈ మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ కాలేజీల గర్తింపు విషయంపై త్వరలోనే తాము ఓ నిర్ణయం తీసుకుంటామని ఇంటర్ ఫలితాల విడుదల సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా మీడియాకు తెలిపారు.