01-05-2025 05:45:40 PM
బిఆర్టియు నియోజకవర్గ ఇన్చార్జ్ గౌడ్ చర్ల సత్యనారాయణ..
తుంగతుర్తి (విజయక్రాంతి): కార్మికుల హక్కుల కోసం, వారి సమస్యల కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ పోరాడుతుందని నియోజకవర్గ అధ్యక్షులు గౌడ్ చర్ల సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలో మేడే ఉత్సవాలను పురస్కరించుకొని కార్మిక పతాకాన్ని ఎగురవేసి అసువులు బాసిన కార్మికులకు నివాళులర్పించారు. అనంతరం సత్యనారాయణ మాట్లాడుతూ... అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు పని భద్రత కల్పించాలని అన్నారు. అంగన్వాడి సిబ్బందికి ఆశా కార్యకర్తలకు, గ్రామపంచాయతీ సిబ్బందికి జీతాలు పెంచిన ఘనత బిఆర్ఎస్ పార్టీదని అన్నారు.
50 మంది డ్రైవర్ కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ సహకారంతో రూ.38 లక్షల ప్రమాద బీమా చెక్కులు అందజేసినట్లు తెలిపారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు 3 వేల నుండి 4వేల మంది కార్మిక కుటుంబాలకు రూపాయ ఖర్చు లేకుండా లేబర్ కార్డులు అందజేసిన ఘనత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. భారత రాష్ట్ర సమితిలో లేబర్ ఇన్సూరెన్స్ కార్డు కలిగి ఉండి సహజ, ప్రమాద మరణాల బాధితులకు 30 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ చేతుల మీదుగా అందజేసినట్లు తెలిపారు. నిర్మాణరంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులను సంఘటితం చేయాలని ఆలోచనతో అసంఘటితంగా ఉన్న కార్మికులను ఒక వేదిక మీదికి తీసుకువచ్చి వారికి లేబర్ ఇన్సూరెన్స్ కార్డులు కిషోర్ కుమార్ సహకారంతో ఇవ్వడం జరుగుతుందన్నారు.
నియోజకవర్గంలోని పేద, బీద కార్మికులకు అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ కు, బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెంపపెట్టు లాగా పని చేయాలని కోరారు. హక్కుల కోసం ఉద్యమిస్తే, పోరాడితే, ప్రశ్నిస్తే, అధికార పార్టీలు అక్రమంగా కేసులు పెడుతున్నారనీ అన్నారు. కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా నిబంధనలన్నీ వారి గుప్పెట్లో పెట్టారనీ తెలిపారు. ప్రభుత్వ సంపదలను అంబానీ, అదానీలకు దోచి పెడుతున్నారనీ మండిపడ్డారు. కార్మికుల హక్కులను సాధించుకునేందుకు మరోసారి కార్మికులంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
అనంతరం తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సహకారంతో మండలంలోని 100 మంది కార్మికులకు లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, జిల్లా నాయకులు గుండగానీ రాములు గౌడ్, బి ఆర్ ఎస్ టి యు మండల అధ్యక్షుడు గడ్డం సోమేశ్, కూరపాటి సోమేష్, బిఆర్ఎస్ మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు తునికి లక్ష్మి, మల్లెపాక రాములు, పోలేపాక రాజేష్, జాజుగల్ల అంబేద్కర్, కొండగడుపుల వీరస్వామి, రమణ జయమ్మ, కనకయ్య, కోటేష్, వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.