26-09-2025 11:50:38 PM
నిజామాబాద్,(విజయక్రాంతి): సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్ని అంటాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ వేడుకకు అట్టహాసపు ఏర్పాట్లు చేశారు. శాసన సభ్యులు డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి, దన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి తదితరులతో పాటు యావత్ జిల్లా యంత్రాంగం భాగస్వాములైన ఈ వేడుకతో కలెక్టరేట్ ప్రాంగణం సరికొత్త శోభతో ఉట్టిపడింది.
రంగు రంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను ఒక చోటకు చేర్చి, గౌరీ మాతను స్తుతిస్తూ మహిళలు లయబద్ధంగా చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మహిళలు ఆలపించిన గేయాల బతుకమ్మ ప్రాశస్త్యాన్ని చాటి చెప్పాయి. ప్రకృతిని ఆరాధించే ఈ వేడుక ఔన్నత్యం ఆవిష్కృతం అయ్యేలా, అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది అనే తేడా లేకుండా మహిళా ఉద్యోగులు, ఐకేపీ, మెప్మా మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ వేడుకకు వన్నెలద్దారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు.
ఎమ్మెల్యేలు, కలెక్టర్, సీ.పీ గౌరీమాతకు సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ, పూల పండుగ ప్రాధాన్యతను ఇనుమడింపజేశాయి. సాయంత్రం 3.30 గంటల నుండి రాత్రి వరకు కూడా ఏమాత్రం అలసట చెందకుండా మహిళలు ఎంతో హుషారుగా బతుకమ్మ ఆడుతూ, తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
దేదీప్యమానమైన విద్యుత్ దీపాల వెలుగులలో, అందంగా అలంకరించుకుని నూతన దుస్తుల్లో బతుకమ్మలతో తరలి వచ్చిన అతివలతో కలెక్టరేట్ ప్రాంగణం అంతా సరికొత్త శోభను సంతరించుకుని అందమైన దృశ్యాన్ని ఆవిష్కరింపజేసింది. దాండియా, కోలాటాలు, బతుకమ్మ ఆటపాటలతో ఎటు చూసినా సందడి వాతావరణం కనిపించింది. ఈ వేడుకలకు విచ్చేసి విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, మహిళలకు జిల్లా యంత్రాంగం తరపున కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేడుకలలో అన్ని శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.