27-09-2025 12:50:55 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్ల అమ్మకాలతో సంచలనం సృష్టించిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బసరత్‌ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పంజా విసిరింది. సుమారు రూ.100 కోట్ల కస్టమ్స్ డ్యూటీ ఎగవేత కేసులో మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ, శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని బసరత్ నివాసం, గచ్చిబౌలిలోని అతడి ఎస్‌కే కార్ లాంజ్ షోరూంపై ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వా ధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో అధికార, విపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతల పేర్లు వినిపిస్తుండటంతో ఈ దాడులు నగరంలో తీవ్ర కలకలం రేపాయి.
డీఆర్‌ఐ కేసు ఆధారంగా..
2025, మేలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్‌ఐ) అధికారులు బసరత్‌ను అరెస్టు చేయడంతో ఈ భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. అమెరికా, జపాన్ వంటి దేశాల నుంచి రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూజర్ వంటి అత్యంత ఖరీదైన కార్లను దుబాయ్, శ్రీలంక మీదుగా దిగుమతి చేసుకొని, వాటి విలువను సుమా రు 50 శాతం తక్కువగా చూపించి పన్ను ఎగవేసినట్టు డీఆర్‌ఐ గుర్తించింది. లెఫ్ట్-హ్యాండ్ డ్రైవ్ వాహనాలను రైట్-హ్యాండ్ డ్రైవ్‌గా మార్చి, నకిలీ పత్రాలతో ఈ దందా నడిపినట్టు తేలింది. ఈ అక్రమ లావాదేవీల ద్వారా సంపాదించిన డబ్బును దారి మళ్లించారన్న ఆరోపణలతో ఫెమా చట్టం కింద ఈడీ రంగంలోకి దిగింది.
దేశవ్యాప్త నెట్‌వర్క్..
గత పదేళ్లుగా నగరంలో లగ్జరీ కార్ల అమ్మకాల్లో ఎస్‌కే కార్ లాంజ్ కీలకంగా వ్యవహరిస్తోంది. ఈ స్కాంలో భాగంగా బసరత్ వ్యక్తిగతంగా 8 వాహనాలను దిగుమతి చేసి రూ.7 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్టు, మొత్తంగా 30కి పైగా కార్లను అక్రమంగా దేశంలోకి తెచ్చినట్టు డీఆర్‌ఐ అంచనా వేసింది. ఈ కార్లను ముంబై, పుణె, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లోని నెట్‌వర్క్ ద్వారా విక్రయించినట్టు తెలుస్తోంది. బసరత్‌కు సంబంధించిన మూడు కంపెనీలపై అధికారులు దృష్టి సారించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, మరిన్ని సంచలన విషయాలు, కీలక వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
సంచలనం రేపుతున్న రాజకీయ కోణం..
ఈ స్కామ్‌లో రాజకీయ నేతల ప్రమేయం ఉండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బసరత్ తన కార్లను బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మాజీ, ప్రస్తుత మంత్రులు, నేతలకు విక్రయించినట్టు దర్యాప్తులో తేలింది. బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ భార్య శైలిమకు చెందిన అట్‌హోమ్ హాస్పిటాలిటీ సంస్థ పేరుతో ఓ టయోటా ల్యాండ్ క్రూజర్ కొనుగోలు చేసినట్టు వెల్లడైంది. ఇదే అంశాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రస్తావిస్తూ బీఆర్‌ఎస్‌పై ఆరోపణలు చేయగా, ఈ స్కామ్‌లో కాంగ్రెస్ మంత్రి కూడా కారు కొన్నారని బీఆర్‌ఎస్ ఎదురుదాడికి దిగింది. దీంతో ఈ కేసు రాజకీయంగానూ వేడి పుట్టిస్తోంది.