calender_icon.png 27 September, 2025 | 2:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులకు నిధులు తెచ్చేందుకు కృషి చేస్తా: ఎంపీ డాక్టర్ కడియం కావ్య

27-09-2025 01:15:00 AM

హనుమకొండ,(విజయక్రాంతి): అభివృద్ధి పనులకి సంబంధించిన ప్రతిపాదనలను అందజేసినట్లయితే  వాటికోసం కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధ్యక్షతన రైల్వే, మున్సిపల్, కుడా పరిధిలో వివిధ అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఎంపీ కడియం కావ్య, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కాజీపేట, హనుమకొండ పరిధిలో రైల్వే వంతెనలు, పైపులైన్లు, రోడ్లు, తాగునీటి సమస్యలు, ఎఫ్ సీ ఐ గోదాం, అంబేద్కర్ భవన్, హనుమకొండ చౌరస్తాలలో వరద నీరు నిలవడంతో తలెత్తుతున్న ఇబ్బందులు, భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ సమస్య, అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చించారు.

ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ  డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ... రైల్వే సంబంధిత అంశాలను, సమస్యలను తన దృష్టికి తీసుకు వచ్చినట్లయితే రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో తాను పాల్గొని మాట్లాడినట్లు పేర్కొన్నారు. అక్కడి సమావేశంలో కాజీపేటలో బస్టాండ్ ఏర్పాటు అంశం కూడా ప్రస్తావించినట్లు తెలిపారు. రైల్వేకు సంబంధించి ఏ సమస్యలు ఉన్న  తన దృష్టికి తీసుకువచ్చినట్లయితే  వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని  చెప్పారు.

వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుందామన్నారు. అభివృద్ధికి సంబంధించిన అంశాలు, ఏవైనా సమస్యలు తలెత్తినట్లయితే రైల్వే అధికారులతో  సంప్రదింపులు జరిపి సమన్వయంతో పరిష్కరించే విధంగా జిల్లా అధికారులను కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రోడ్లు వేయాలని తన వద్దకు ప్రజలు వస్తున్నారని ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలలో రోడ్లు వేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. వరద నీరు నిలవకుండా తీసుకునే చర్యలపై  ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. దిశ సమావేశంలోనూ వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చర్చించినట్లు తెలిపారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడే విధంగా జిల్లాకు సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరు అయ్యిందని పేర్కొన్నారు. సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ కోసం ప్రభుత్వ భవనం కావాల్సి ఉందని, త్వరగా బిల్డింగ్ ఇచ్చినట్లయితే  ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు  అందుబాటులోకి వస్తాయని అన్నారు. దేశవ్యాప్తంగా 22 సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లను కేంద్రం మంజూరు చేసింది అని, అందులో ఒకటి వరంగల్ కు మంజూరు చేసిందన్నారు. రైల్వే, దేవాలయాల అభివృద్ధికి సంబంధించిన ప్రసాద్ పథకం, యూనివర్సిటీలలో అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు అందించినట్లయితే వాటిని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు.

బోడగుట్ట ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందని, ఆ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ దృష్టికి ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీసుకెళ్లగా పైపులైన్ వేసి ఉందని, వాటిని కలిపి తాగునీటి ఇబ్బందులు తొలగిస్తామన్నారు. హనుమకొండ అశోక జంక్షన్, చౌరస్తా లో పార్కింగ్ సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సూచించగా ప్రతిపాదనలను పరిశీలిస్తామని కమిషనర్ బదులిచ్చారు. హనుమకొండ చౌరస్తా, అంబేద్కర్ భవన్ ప్రాంతాలలో వరద నీరు నిలిచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ కి సూచించారు.

వరద నీరు నిల్వకుండా చర్యలు చేపడతామని కమిషనర్ సమాధానమిచ్చారు. భద్రకాళి దేవాలయం వద్ద పార్కింగ్ ఇబ్బందులు, న్యూ శాయంపేటలో ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులు, వెజ్, నాన్ మార్కెట్ ఏర్పాటు, తదితర అంశాలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించినట్లు పేర్కొన్నారు. వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రిసిటీ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. నగర సుందరీకరణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.