calender_icon.png 27 September, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన మణుగూరు ఎస్సై

27-09-2025 12:12:00 AM

రూ.40 వేలు తీసుకుంటూ పట్టుబడ్డ రంజిత్

మణుగూరు, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా మణుగూరు పోలీస్ స్టేషన్ అవినీతికి అడ్డాగా మారింది. ఓ కేసు విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్సై రంజిత్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ శుక్రవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఖమ్మం ఏసీబీ ఇన్‌చార్జ్ డీఎస్పీ విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ఇద్దరు వ్యక్తులకు స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.40 వేలు ఎస్‌ఐ రంజిత్ డిమాండ్ చేశాడు.

దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించడంతో ఆడియా, వీడియో టేపుల ఆధారంగా ఎస్‌ఐ రంజిత్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశామన్నారు. కాగా స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ సీఐ సతీష్‌కుమార్ గత మే నెలలోనే ఏసీబీకి పట్టుబడ్డాడు. అదే తరహాలో ఎస్సై రంజిత్  కూడా ఏసీబీ వలలో చిక్కడం కలకలం రేపింది. 

పాల్వంచ ఎస్సైకి మెమో జారీ 

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్సై సుమన్‌కు ఎస్పీ రోహిత్‌రాజ్ మెమో జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయక్రాంతి దినపత్రికలో వెలుబడిన వరుస కథనాలకు స్పందించిన ఎస్పీ విచారణ అనంతరం మెమో జారీ చేశారు. మరోవైపు ఎస్సై సుమన్ అక్రమ వసూళ్లపై ఇంటిలిజెన్సీ, ఎస్‌బి శాఖ ఉన్నతాధికారులు లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. భూ వివాదాల్లోనూ, స్టేషన్ బెయిల్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న విషయం విదితమే.