calender_icon.png 27 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూటమి కట్టు.. బ్రాండీషాప్ పట్టు..!

27-09-2025 01:15:40 AM

లక్కునోళ్ళ కోసం వెతుకులాట

మహబూబాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్తగా బ్రాండీ షాపుల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల స్వీకరణ కు నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించింది. అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించి, 23న దుకాణాల కేటాయింపుకు లక్కీ డ్రా నిర్వహించనున్నారు. డ్రాలో ఎంపికైన షాపుల యజమానులు 24 తేదీ వరకు మొదటి విడత లైసెన్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

డిసెంబర్ 1 నుండి కొత్త మద్యం షాపులో మద్యం విక్రయాలు ప్రారంభిస్తారు. మహబూబాబాద్ జిల్లాలో 59 మద్యం షాపులకు 2027 నవంబర్ 30 వరకు కొత్తగా లైసెన్స్ పొందిన యజమానులు రెండేళ్ల పాటు మద్యం విక్రయాలు నిర్వహించాల్సి ఉంటుంది.

అయితే గత రెండేళ్ల క్రితం మద్యం షాపుల నిర్వహణ సమయంలో దరఖాస్తు ఫీజు రెండు లక్షలు ఉండగా ఇప్పుడు మరో లక్ష రూపాయలు పెంచి మూడు లక్షలకు నిర్ణయించారు. ఒక్క వ్యక్తి మూడు లక్షల రూపాయల చొప్పున చెల్లిస్తూ ఎన్ని షాపులకైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు. దరఖాస్తు రుసుము మూడు లక్షలు తిరిగి చెల్లించబడదు. 

దరఖాస్తుల కోసం సిండికేటు.!

లక్కీ డ్రా ద్వారా మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ కేటాయిస్తుండడంతో ఒక్కో దరఖాస్తు చేస్తే షాపు లభిస్తుందో లేదో అన్న అనుమానంతో ‘సిండికేట్’ గా ఏర్పడుతున్నారు. 10 వేల నుంచి లక్షా రెండు లక్షల వరకు స్థాయికి బట్టి తలా కొంత పోగేసి మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసేందుకు కూటమి కడుతున్నారు. మద్యం షాపు నిర్వహించే ప్రస్తుత వ్యాపారులతో పాటు కొత్తవారు కూడా ఈ రంగంలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

ఈ క్రమంలో ఎక్కువగా వ్యాపారం సాగే మద్యం షాపుల వివరాలను సేకరించి, ఆ షాపులకు ఎక్కువ దరఖాస్తులు చేసి డ్రాలో దక్కించుకునే విధంగా వ్యూహరచన చేస్తున్నారు. దీనితో దరఖాస్తు ఫీజు 3 లక్షల రూపాయలు తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో, ఒక్కరే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసే పరిస్థితి లేకపోవడంతో కూటమి గా ఏర్పడుతున్నారు. ఎవరెంత పెట్టుబడి పెడితే ఒకవేళ గనుక ఆ షాపు డ్రాలో దక్కితే వారికి అందులో డబ్బులు చెల్లించిన ప్రకారం వాటా ఇచ్చే విధంగా ముందుగానే ‘అగ్రిమెంట్’ చేయిస్తున్నారు.

దీంతో పదివేల రూపాయలు ఉన్నా 30 మంది కలిసి ఒక దరఖాస్తు చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అలాగే లక్ష, 50,000, ఇద్దరు కలిసి లక్షన్నర చొప్పున, మరికొందరు సొంతంగానే ఐదు నుంచి పది షాపుల వరకు,  ఇంకొందరు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేయడానికి ప్రయత్నాలు ఆల్రెడీ మొదలుపెట్టారు. గత నెల రోజుల నుండి కొత్త మద్యం షాపుల నిర్వహణ కోసం ఎక్సైజ్ శాఖ ఎప్పుడు ప్రకటిస్తుందో నన్న ఆత్రుతతో ఎదురుచూస్తుండగా, గురువారం ఎక్సైజ్ శాఖ ప్రకటనతో ఔత్సాహికులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. 

లక్కుంటేనే షాపు..?

పూర్తిగా అదృష్టం పైనే మద్యం షాపు కేటాయింపు ఆధారపడి ఉండడంతో దరఖాస్తు ఫీజు చెల్లించడంతోపాటు ‘లక్కు’ ఎవరిపై ఉందనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ఎవరి పేరు పై బాగుందో చూసి చెప్పండని,  జాతకాలను చూపిస్తున్న చూపించుకుంటున్నారు. పేర్లలో అక్షరాలు, సంఖ్యల ఆధారంగా జాతకం బాగుంటే లక్కీ డ్రాలో బ్రాండీ షాపు దక్కుతుందని జాతకం చూసి చెప్పే పండితుల సూచన మేరకు ఆ ‘నామ’దేయుల కోసం వెతుకులాట ప్రారంభించారు.

అన్నా నీ పేరు మీద జాతకం చూపిస్తే ‘బలం’ బాగుందని చెప్పారు.. దరఖాస్తు ఫీజు నేనే కడతా.. డ్రాలో షాపు వస్తే కొంత ‘గిఫ్ట్’ ఇస్తా.. షాపు కోసం నీ పేరుపై దరఖాస్తు చేస్తానంటూ డబ్బున్న కొందరు జాతక ప్రకారం అనుకూలమైన వారి వెంట  పడుతున్నట్లు ప్రచారం సాగుతుంది.

నష్టాలు అంటూనే.. పెరుగుతున్న పోటీ..!

మద్యం షాపుల నిర్వహణలో నష్టాలు వస్తున్నాయి అంటూనే ఏటేటా మద్యం షాపుల కోసం పోటీపడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండేళ్ల క్రితం మహబూబాబాద్ జిల్లాలో 59 షాపులకు తక్కువలో తక్కువ పది నుంచి 100కు పైగా దరఖాస్తులు చేయగా మొత్తం 2,571 దరఖాస్తులు వచ్చాయి.

ఈసారి దరఖాస్తు సొమ్ము రెండు లక్షల నుండి మూడు లక్షలకు పెంచడంతో దరఖాస్తుల సంఖ్య  కొంత తగ్గవచ్చని చెబుతున్నారు. లక్కీ డ్రాలో షాపులు పొందిన వారు ‘గుడ్ విల్’ తీసుకొని మద్యం వ్యాపారం చేసే వారికి అప్పగించే వారే అధికంగా ఉంటున్నారు. దీనివల్ల మద్యం షాపుల దరఖాస్తులు సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోందని చెబుతున్నారు.