27-09-2025 01:13:19 AM
రూ. 1,159 కోట్లు పెండింగ్!
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : యాసంగిలో సన్నాలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. సన్నరకం ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మద్దతు ధరతో పాటు అదనం గా క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. అయితే, యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముగిసి నాలుగు నెలలు కావొస్తున్నా.. రైతుల ఖాతాలో ఇప్పటికీ బోనస్ డబ్బులు జమ కాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
74.22 లక్షల టన్నుల ధాన్యం సేకరణ
యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 13,07861 మంది రైతుల నుంచి మొత్తం 74.22 లక్షల టన్నుల (దొడ్డు, సన్నరకం) వరి ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వీటిలో దొడ్డు రకం ధాన్యం 8,98,830 మంది రైతుల నుంచి 51.03 లక్షల టన్నులు, ఇక 4,09,031 మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్నరకం ధాన్యం కూడా సేకరించింది. దొడ్డు , సన్నరకం ధాన్యానికి సంబంధించి మద్దతు ధర డబ్బులు రూ. 17,198.58 కోట్లు కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అయితే, సన్నరకానికి సంబంధించిన బోనస్ డబ్బులు రూ. 1,159.64 కోట్లు మాత్రం ఇంకా చెల్లించాల్సి ఉంది.
సన్నాల సాగుకు మొగ్గు
రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో.. సన్న వరిని ఉత్పత్తి చేయాలని సూచించింది. దీంతో బోనస్ వస్తుందనే ఆశతో మెజార్టీ రైతులు సన్నాల సాగుకు మొగ్గు చూపి అధికంగా ఉత్పత్తి చేశారు. కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మద్దతు ధరకు సంబంధించిన డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసినా బోనస్ మాత్రం చెల్లించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇస్తారా.. ఇవ్వరా ?
గత యాసంగిలో కొనుగోలు చేసిన సన్నాలకు సంబంధించిన బోనస్ డబ్బులు మూడు నెలల తర్వాత రైతుల ఖాతాల్లో జమ చేశారు. వాటిలో ఇంకా కొందరికి అందలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ యాసంగికి సంబంధించి కూడా సన్నాలు కొనుగోళ్లు పూర్తయి మూడు నెలలు దాటినా బోనస్ చెల్లించడం లేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అధికారులు కూడా స్పష్టత ఇవ్వడం లేదు. రాష్ట్ర ఖజానా ఆశించిన విధంగా లేదని సీఎం రేవంత్‌రెడ్డినే స్వయంగా ప్రకటించడంతో సన్నాలకు బోనస్ ఇస్తారా..? లేదా ..? అనే మీమాంసలో రైతులు ఉన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యం (ఎల్‌ఎంటీ) మొత్తం రైతులు
దొడ్డు రకం 51.03 8,98,830
సన్న రకం 23.19 4,09,031
మొత్తం 74.22 13,07,861