calender_icon.png 27 September, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీజీపీగా శివధర్ రెడ్డి

27-09-2025 12:18:05 AM

  1. రాష్ట్ర పోలీస్ విభాగానికి నూతన సారథిగా సీనియర్ ఐపీఎస్ అధికారి నియామకం  
  2. మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం
  3. వ్యూహాత్మక పనితీరుతో తీవ్రవాదాన్ని అదుపు చేయడంలో దిట్ట
  4.   2007లో భాగ్యనగరంలో శాంతిని పునరుద్ధరించడంలో చొరవ
  5. నయీం ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర 
  6. అక్టోబర్ 1న బాధ్యతల స్వీకారం 

హైదరాబాద్,సిటీ బ్యూరో సెప్టెంబర్ 26 (విజయక్రాంతి ):  తెలంగాణ రాష్ర్ట పోలీస్ విభాగానికి నూతన సారథిగా సీనియర్ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్  బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ర్ట ప్రభు త్వం శుక్రవవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి తన నియామక ఉత్తర్వులను అందుకున్నారు.

అక్టోబర్ 1వ తేదీన ఆయన రాష్ర్ట డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా బాధ్యతలు చేపట్టనున్నారు. క్షేత్రస్థాయి నుంచి ఇంటెలిజెన్స్ వరకు, శాంతిభద్రతల పరిరక్షణ నుంచి కీలక ఆపరేషన్ల వరకు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం కలిగిన శివధర్ రెడ్డి నియామకం పట్ల పోలీస్ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

న్యాయవాద వృత్తి నుంచి సివిల్ సర్వీసెస్ వైపు

1994 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ పెద్దతుండ్ల గ్రామ మూలాలున్న కుటుంబానికి చెందినవారు. హైదరాబాద్‌లోనే జన్మించిన ఆయన, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఇక్కడే అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొందిన తర్వాత కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి, సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో అడుగుపెట్టారు.

శాంతిభద్రతల పరిరక్షణలో చెరగని ముద్ర

విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం సబ్ డివిజన్లలో ఏఎస్పీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన శివధర్ రెడ్డి, అంచెలంచెలుగా ఉన్నత పదవులను అధిరోహించారు. మావోయిస్టుల అణచివేత.. ఆదిలాబాద్, నల్లగొండ, శ్రీకాకుళం వంటి సమస్యాత్మక జిల్లాల ఎస్పీగా, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డీఐజీగా మావోయిస్టుల కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపారు.

ఆయన వ్యూహాత్మక పనితీరుతో వామపక్ష తీవ్రవాదాన్ని అదుపు చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2007లో మక్కా మసీదు పేలుళ్లు, తదనంతర కాల్పులతో హైదరాబాద్ అట్టుడుకుతున్న సమయంలో, ప్రభుత్వం ఆయనను సౌత్ జోన్ డీసీపీగా నియమించింది. అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో రాత్రింబవళ్లు శ్రమించి, ప్రజల్లో భరోసా నింపి, నగరంలో శాంతిని పునరుద్ధరించడంలో ఆయన చూపిన చొరవ చిరస్మరణీయం.

తెలంగాణ తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా...

2014లో తెలంగాణ రాష్ర్టం ఆవిర్భవించిన తర్వాత, తొలి ఇంటెలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. రాష్ట్రానికి పెనుసవాలుగా మారిన గ్యాంగ్‌స్టర్ నయీంను మట్టుబెట్టిన ఆపరేషన్‌ను ముందుండి నడిపింది ఆయనే. ఆయన వ్యూహరచనతోనే ఆ ఆపరేషన్ విజయవంతమైంది. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక, మరోసారి ఆయన్ను ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించడం ఆయన సామర్థ్యానికి నిదర్శనం. ఆగస్టు 2024లో ఆయన డీజీపీ హోదాకు పదోన్నతి పొందారు.

విశిష్ట సేవలు, అంతర్జాతీయ గుర్తింపు..

* శివధర్ రెడ్డి తన కెరీర్‌లో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

* గ్రేహౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, పలు జిల్లాల ఎస్పీగా సేవలు అందించారు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా అవినీతిపై పోరాడారు.

* ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా కొసావోలో పనిచేసి అంతర్జాతీయ గుర్తింపు పొందారు.

* గ్యాలంట్రీ మెడల్, రాష్ర్టపతి పోలీస్ పతకం, ఐక్యరాజ్యసమితి పతకం సహా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి.