calender_icon.png 27 September, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరబిందో ఫార్మాను తగులబెడుతా!

27-09-2025 12:14:25 AM

  1. ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న పరిశ్రమ
  2. అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలే
  3. ఈరోజే పీసీబీ చర్యలు తీసుకోవాలి
  4. లేదంటే ఆదివారం 11 గంటలకు కంపెనీని తగులబెడతా
  5. హెచ్చరిస్తూ వీడియో విడుదల చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి 

జడ్చర్ల, సెప్టెంబర్ 26: ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న అరబిందో ఫార్మా కంపెనీపై చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినా, అసెంబ్లీలో ప్రస్తావించినా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదలడం ఆపడం లేదని, ఈ వ్యవహారంలో తక్షణ చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలికి ఒక్క రోజు టైమ్ ఇస్తున్నానని లేదంటే అరబిందో కంపెనీని తగులబెడుతానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి అల్టిమేటం ఇచ్చారు.

ఈరోజే(శనివారం) పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆదివారం 11 గంటలకు అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి తగులబెడతానని హెచ్చరించారు. ప్రస్తుతం తన కుటుంబంతో కర్నాటక యాత్రలో ఉన్న అనిరుధ్‌రెడ్డి ఈ మేరకు ఒక వీడియోను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. పోలేపల్లి ఫార్మా సెజ్‌లోని అరబిందో ఫార్మా కంపెనీ ముద్దిరెడ్డిపల్లి చెరువులోకి కలుషిత జలాలను వదులుతున్న కారణంగా పంటలు పండడం లేదని, చెరువులో ఉన్న చేపలు కూడా చనిపోతున్నాయని తాను గతంలోనే అసెంబ్లీలో ఫిర్యాదు చేసినా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదని చెప్పారు.

ఈ విషయంలో అధికారులకు అరబిందో ఫార్మాకు మధ్య ఏ లాలూచీ ఉందో తనకు తెలియదని ఆరోపించారు. మరోసారి కలుషిత జలాలను చెరువులోకి వదిలితే సహించేది లేదని, మరోసారి అలా చేస్తే అరబిందో ఫార్మా కంపెనీని తగుల బెడతానని గతంలోనే తాను హెచ్చరించానని గుర్తు చేశారు. అయినప్పటికీ తన హెచ్చరికలను పెడచెవిన పెట్టి అరబిందో ఫార్మా కంపెనీ మళ్లీ కలుషిత జలాలను చెరువులోకి వదులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను కూడా మీడియాకు విడుదల చేశారు.

కలుషిత జలాలను చెరువులోకి వదలడం వెంటనే ఆపాలని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవడానికి శనివారం ఒక్క రోజు గడువు ఇస్తున్నానని, ఈ ఒక్క రోజులో చర్యలు తీసుకోకపోతే ఆదివారం ఉదయం 11 గంటలకు తాను అరబిందో ఫార్మా వద్దకు వెళ్లి తగలబెడతానని హెచ్చరించారు. రైతులు నష్టపోతున్నా చూస్తూ ఊరుకొనే ఓపిక తనకు లేదన్నారు.