calender_icon.png 25 November, 2025 | 12:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరు ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే జీఎంఆర్

25-11-2025 12:38:54 AM

పటాన్చెరు, నవంబర్ 24 :పటాన్చెరు డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఐడియా ఆసుపత్రి ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు పూర్తయ్యాయని, అతి త్వర లో ఆస్పత్రికి సంబంధించిన పూర్తి స్థాయి సామాగ్రి రాబోతుందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం ఆస్పత్రి వైద్యులు, టీజీఎంఎస్‌ఐడీసీ  విభాగం అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు.

అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ.187 కోట్లతో ఆస్పత్రి నిర్మాణ పనులు శరవేగంగా చేయడం జరిగిందని తెలిపారు. ఆస్పత్రి సివిల్ వర్క్ పూర్తి కావడం జరిగిందని, ఆపరేషన్ థియేటర్, స్కానింగ్ మెషిన్లు, ఇతర పరికరాల కోసం 23 కోట్ల 56 లక్షల రూపాయల నిధులు వెచ్చించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే నెల రోజుల్లో ఆసుపత్రి ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. హరిత ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందని గుర్తు చేశారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆసుపత్రిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతంలో వెలువడే కాలుష్యం మూలంగా వచ్చే వ్యాధులను గుర్తించి అందుకు అవసరమైన వైద్య విభాగాలను, నిపుణులైన వైద్యులు ఆస్పత్రిలో అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో డిసిహెచ్‌ఎస్ షరీఫ్, ఈఈ రవీందర్ రెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ చంద్రశేఖర్, ఆసుపత్రి సలహా సంఘం కమిటీ సభ్యులు కంకర సీనయ్య, తదితరులు పాల్గొన్నారు.