25-11-2025 12:36:22 AM
వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి, నవంబర్ 24 (విజయక్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం లోని ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మరికుంట మెడికల్ కాలేజీ సమీపంలో 20 ఎకరాలలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నూతన ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లతో నూతన భవనాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.
ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తి లో ఉన్న చారిత్రక రాజభవనం నిర్మాణ శైలిని పోలి ఉంటుందని అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ పాఠశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే విధంగా పనులు ముమ్మరం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.