16-09-2025 12:09:58 AM
పటాన్చెరు, సెప్టెంబర్ 15 :నిరుపేదలకు, అనాధలకు, నిరాశ్రయుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించిన యాత్ర దానం పోస్టర్ ను పటాన్చెరు ఎమ్మెల్యే ఆవిష్కరించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆధ్వర్యంలో పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలని ఉన్నా ఆర్థిక స్తోమత లేని అనాధలు, నిరాశ్రయులు, వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పంపించేలా ఎవరైనా దాతలు ముందుకు వస్తే యాత్ర దానం కార్యక్రమం ద్వారా బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఆర్టీసీ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం పట్ల ఆయన అభినందనలు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, నిరాశ్రయులను సైతం వివిధ పుణ్యక్షేత్రాలకు పంపించేందుకు సొంత నిధులు ఖర్చు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించి వివరాలు అందిస్తామని అధికారులకు తెలిపారు.