ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన ఎమ్మెల్యే జారే
రూ.41.50 లక్షలతో పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి
అశ్వారావుపేట, జూన్15 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని విధంగా తీర్చిదిద్దేందుకు కృషి జరుగుతోందన్నారు.
వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైన తొలి రోజున అశ్వారావుపేట నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన ఎమ్మెల్యే విద్యార్థులకు ఆత్మీయ స్వాగతం పలికారు. కొత్త విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించేందుకు విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారికి పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న ఉదయం అల్పాహార కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యా ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. చిన్నారులతో మమేకమై వారి చదువులు, ఆశయాలు, పాఠశాలల్లో ఉన్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. పర్యటనలో భాగంగా రెడ్డిగూడెం, తిరుమలకుంట కాలనీ, తోగ్గుడెం, మద్దులమడ, నారాయణపురం గ్రామాల ప్రభుత్వ పాఠశాలల్లో రూ.37.50 లక్షల వ్యయంతో నిర్మించిన కాంపౌండ్ వాల్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. దిబ్బగూడెం ప్రభుత్వ పాఠశాలలో రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన ఆధునిక మరుగుదొడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు.
ముఖ్యంగా బాలికల విద్యాభ్యాసానికి పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఎంతో అవసరమని, వారి ఆరోగ్యం, గౌరవం దృష్ట్యా ఈ సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. పాఠశాలల్లో తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, మండల అధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






