calender_icon.png 30 September, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి మండలంలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు..

29-09-2025 10:33:55 PM

టేకులపల్లిలో సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోరం 

టేకులపల్లి (విజయక్రాంతి): బతుకమ్మ వేడుకల్లో చివరి రోజున ‘సద్దుల బతుకమ్మ’ గొప్పగా ఆరాధిస్తారు. ఈ ఏడాది ఆశ్వయుజ శుద్ధ అష్టమి (దుర్గాష్టమి) తిథి సోమ, మంగళవారాల్లో ఉండడడంతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం, మరికొన్ని ప్రాంతాల్లో మంగళవారం సద్దుల బతుకమ్మను నిర్వహిస్తున్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని కోదండ రామాలయం వద్ద సోమవారం సాయంత్రం సద్దుల బతుకమ్మ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రత్యేక పూజ నిర్వహించి ప్రారంభించారు. పూలపండుగతో టేకులపల్లి మండలం కోయగూడెం, బోడు, ముత్యాలంపాడు, బేతంపూడి, తడికలపూడి, బొమ్మనపల్లి, సంపత్ నగర్, రామచంద్రునిపేట తదితర గ్రామాల్లో కళకళలాడుతోంది. మండలంలో ఎక్కడ విన్న బతుకమ్మ పాటలే. తీరొక్క పువ్వులతో పేర్చే బతుకమ్మ సంబురాలతో మండలంలో సందడి నెలకొంది. తొమ్మిది రోజులు జరిగే... బతుకమ్మ పండుగలో రోజుకో ప్రత్యేకత ఉంటుంది.

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచే బతకమ్మ పండుగలో చివరి ఘట్టమైన సద్దుల బతుకమ్మ నేడు. చివరిరోజు సద్దుల బతుకమ్మ... సందడి అంతా కనిపిస్తుంది. ఊరూవాడలు పూలవనాలుగా మారాయి. వాడవాడలా పూలపండుగ సంబరాలు జరుగుతున్నాయి. పెత్రామాస నుంచి దుర్గాష్టమి వరకు తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తూ.. మహిళలు ఆడుతారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతి రోజూ.. ఓ ప్రత్యేకత. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మ తల్లికి సమర్పిస్తారు. తొమ్మిదో రోజున సద్దుల బతుకమ్మ అంటే ఇక ఆ సందడే సందడి. 9వ రోజు సద్దుల బతుకమ్మను నిర్వహించే మహిళలు 9 అంతరాలుగా బతుకమ్మను పేర్చనున్నారు. తంగేడు, గునుగు, కట్ల, బంతి, చామంతి, సీతజడలు వంటి పూలతో రోడ్లు పూలవనంలా మారాయి. సద్దుల బతుకమ్మకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఏర్పాట్లను అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళా మణులు ఆనందోత్సవాలతో బతుకమ్మ పాటలకు నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమంలో కోయగూడెం మాజీ సర్పంచ్ కోరం ఉమా, ఇస్లావత్ రెడ్యానాయక్, ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగీలాల్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.