29-09-2025 10:29:54 PM
చివ్వెంల (విజయక్రాంతి): ఈరోజు చివ్వెంల మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామం పూల పండుగ సద్దుల బతుకమ్మతో సందడిగా మారింది. తెల్లవారుజామున నుంచే మహిళలు పూలు ఏరుకొని, అందంగా బతుకమ్మలు పేర్చి, పాటలు పాడుతూ, ఆటలాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. బతుకమ్మ చుట్టూ వాతావరణం పండుగలా మారి, చిన్నారుల కిలకిలలు, మహిళల జానపద గీతాలు, పూల పరిమళం, గ్రామాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చాయి.
మహిళలను ప్రోత్సహించేందుకు టిఫిన్ బాక్సులు బహుమతిగా అందజేయడం ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి దాతలుగా మండవ ఎల్లయ్య, అమరగాని వీరయ్య, మండల లక్ష్మి సహకరించగా, ప్రతి సంవత్సరం ఇలా మహిళలకు బహుమతులు అందించడం ఆనవాయితీగా కొనసాగుతోందని గ్రామ పెద్దలు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు మండవ రాము, మండల కోటేష్, గ్రామపంచాయతీ కార్యదర్శి, సిబ్బంది విశేష కృషి చేశారు. వారికి గ్రామ పెద్దలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామమంతా పూల పరిమళం వెదజల్లగా, జానపద గీతాలు, ఆటల సందడి బతుకమ్మ వేడుకకు మరింత శోభను తీసుకొచ్చాయి.